పెరోల్ పొడిగిస్తాం కానీ..రూ.600 కోట్లు చెల్లించు!

28 Nov, 2016 16:05 IST|Sakshi
పెరోల్ పొడిగిస్తాం కానీ..రూ.600 కోట్లు చెల్లించు!
సహారా చీఫ్ సుబ్రతా రాయ్ పెరోల్ గడువును  సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. 2017 ఫిబ్రవరి 6వరకు పెరోల్ గడువు పొడిగిస్తున్నట్టు సుప్రీం సోమవారం పేర్కొంది. అయితే జైలు బయట ఉండటానికి ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు రూ.600 కోట్లను డిపాజిట్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం సహారా చీఫ్ను ఆదేశించింది. ఒకవేళ డబ్బును డిపాజిట్ చేయని పక్షంలో సరెండర్ అవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ 25న కూడా సుప్రీంకోర్టు సుబ్రతా రాయ్ పెరోల్ను నవంబర్ 28వరకు పొడిగించింది. ఈ పొడిగింపుకు సహారా గ్రూప్ రూ.200 కోట్లు డిపాజిట్ చేసింది. మరో రూ.200 కోట్లను నవంబర్ ఆఖరికల్లా చెల్లించనున్నట్టు సహారా పేర్కొంది.  కాగ, సుబ్రతారాయ్ తల్లి గత మే నెలలో మరణించడంతో కోర్టు మానవతా దృక్పథంతో ఆయనకు పెరోల్ మంజూరు చేసింది. ఆ తర్వాత డిపాజిట్ దారులకు డబ్బు వెనక్కి ఇచ్చేందు కోసం నాటి నుంచి ఆయన పెరోల్ను కోర్టు పొడిగిస్తూ వస్తోంది. నేటితో ముగుస్తున్న ఆయన పెరోల్ గడువును అపెక్స్ కోర్టు మరోసారి పొడిగించింది.
 
 
మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి  రెండు సహారా గ్రూప్ సంస్థలు రూ.25,000 కోట్లు వసూలు చేయడం.. వడ్డీతో సహా మొత్తం రూ.35,000 కోట్లు దాటి వాటిని తిరిగి చెల్లించడంలో ఆ సంస్థలు వైఫల్య చెందాయి. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ సంస్థల చీఫ్ సుబ్రతారాయ్ 2014 మార్చి 4 నుంచీ తీహార్ జైలులో ఉన్నారు. అనంతరం ఆయన పెరోల్పై బయటికి వచ్చారు. ఆయన బెయిల్‌కు రూ.10,000 కోట్లు(సగం నగదు రూపంలో, సగం బ్యాంకు గ్యారెంటీ రూపంలో) చెల్లించాలని మార్చి 26న సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిలో సగం మొత్తం సహారా నగదు రూపంలో సహారా చెల్లించింది. కానీ బ్యాంకు గ్యారెంటీ తరుఫును ఇవ్వాల్సిన రూ.5000 కోట్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. 
మరిన్ని వార్తలు