'జస్టిస్ గోగోయ్.. మీరు నన్ను భయపెట్టలేరు'

11 Nov, 2016 19:24 IST|Sakshi
'జస్టిస్ గోగోయ్.. మీరు నన్ను భయపెట్టలేరు'

న్యూఢిల్లీ: మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూకు కోర్టు ధిక్కార నేరం కింద సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు జారీ చేసింది. న్యాయవ్యవస్ధ చరిత్రలో ఓ మాజీ న్యాయమూర్తి కోర్టు ధిక్కార నేరం కింద నోటీసులు అందుకోవడం ఇదే ప్రథమం. సౌమ్య రేప్ కేసులో తీర్పును కాకుండా న్యాయమూర్తులను కట్జూ కించపరిచారని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది.

సౌమ్య కేసులో నిందితుడు గోవిందచామికి మరణ దండన విధించాలంటూ కేరళ ప్రభుత్వం, సౌమ్య తల్లి వేసిన పిటిషన్లను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్ధానం మాజీ న్యాయమూర్తి కట్జూకు నోటీసు జారీ చేస్తున్నట్లు తెలిపింది. కాగా సుప్రీంకోర్టు నోటీసుపై స్పందించిన మార్కండేయ కట్జూ.. ముగ్గురు జడ్జిల ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ గోగోయ్ ను ఉద్దేశించి వ్యాఖ్యాలు చేశారు.

’మిస్టర్ గోగోయ్ మీరు నన్ను భయపెట్టలేరు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నేను భయపడను’ అని అన్నారు. జస్టిస్ గోగోయ్ ను ఏక సంభోదన చేస్తూ మాజీ న్యాయమూర్తి కట్జూ పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో జస్టిస్ గోగోయ్ తన జూనియర్ గా పనిచేశారని గుర్తు చేశారు. సౌమ్య కేసులో తీర్పును ఆక్షేపించడంపై గత నెల 17వ తేదీన జస్టిస్ కట్జూకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

దీనిపై శుక్రవారం విచారించిన అత్యున్నత న్యాయస్ధానం నిందితుడు గోవిందచామీకి మరణదండన ఇస్తూ తీర్పునివ్వకపోవడం ఎలా తప్పో? చెప్పాలని కోరింది. 2013లో గోవిందచామీకి ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను అమలు చేయాలని కేరళ కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నిందితుడికి శిక్షను తగ్గిస్తూ జీవిత ఖైదును విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ తీర్పుపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి మార్కండేయ కట్జూ ఫేస్ బుక్ లో స్పందించారు. నిందితుడికి శిక్షను తగ్గించడం న్యాయవ్యవస్ధలో జరిగిన పెద్ద తప్పుగా అభివర్ణించారు. సెక్షన్ 300ను కోర్టు పూర్తిగా చదవలేదని తన పోస్టులో పేర్కొన్నారు. బహిరంగ న్యాయస్ధానంలో కోర్టు ఆదేశాలను పునఃపరిశీలించాలని అన్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు