బీఫ్ బ్యాన్ పిటిషన్పై మహారాష్ట్రకు నోటీసులు

17 Aug, 2016 13:56 IST|Sakshi

న్యూఢిల్లీ : బీఫ్ నిషేధంపై దాఖలైన పిటిషన్పై స్పందించాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ పిటిషన్పై ప్రభుత్వం ఆరు వారాల్లో స్పందించాలని జస్టిస్ ఏకే సిక్రి, డి.వై చంద్రచూద్ బెంచ్ ఆదేశించింది. ప్రజలు తమ ఆహారాన్ని వారు ఎంపికచేసుకునే అధికారం కల్పిస్తూ ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అఖిల్ భారత్ క్రిషి గోసేవ సంఘ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గోవధపై మహారాష్ట్రలో నిషేధం కొనసాగుతుందని, కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆవు మాంసాన్ని నిల్వ చేయడం కానీ, తినడం కానీ తప్పుకాదని ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. బీఫ్ తినడం సరికాదంటూ నిషేధం విధించాలని కొందరు కోర్టుకు ఎక్కితే, అనేక సంస్కృతుల సమ్మేళనమైన ముంబై నగరంలో నిషేధం విధింపు సరికాదని కొందరు వాదిస్తున్నారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో వచ్చేవారం విచారణకు రానుంది.  


గత ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం బీఫ్ వినియోగంపై పూర్తి స్థాయిలో నిషేధం విధించింది. గో మాంసాన్ని అమ్మినా లేక గోవధ చేసినా చట్ట ప్రకారం నేరంగా పరిగణించింది. ఒకవేళ ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్లకు అయిదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటన చేసింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వ తీర్పును ఆ రాష్ట్ర హైకోర్టు మే6న పాక్షికంగా రద్దు చేసింది.

మరిన్ని వార్తలు