ట్రిపుల్‌ తలాఖ్‌: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

22 Aug, 2017 13:34 IST|Sakshi
ట్రిపుల్‌ తలాఖ్‌: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ట్రిపుల్‌ తలాఖ్‌ రాజ్యాంగ విరుద్ధం
ముస్లిం మహిళలకు ప్రాథమిక హక్కులకు భంగం
తేల్చిచెప్పిన సర్వోన్నత న్యాయస్థానం


న్యూఢిల్లీ: ముస్లిం సామాజికవర్గంలో అమల్లో ఉన్న  వివాదాస్పద విడాకుల విధానం ట్రిపుల్‌ తలాఖ్‌పై సుప్రీంకోర్టు మంగళవారం చరిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. ట్రిపుల్‌ తలాఖ్‌ రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో తీర్పు వెలువరించింది. ట్రిపుల్‌ తలాఖ్‌ చట్టవిరుద్ధం, రాజ్యాంగవిరుద్ధం, ఎంతమాత్రం చెల్లబోదని ధర్మాసనం స్పష్టంచేసింది. ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులకు ట్రిపుల్‌ తలాఖ్‌ భంగం కలిగిస్తున్నదని, రాజీకి ఏమాత్రం అవకావం ఇవ్వకుండా సత్వరమే వివాహాన్ని రద్దు చేయడం ఎంతమాత్రం సమ్మతం కాదని తేల్చిచెప్పింది.

అయితే, ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌, మరో న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ మెజారిటీతో తీర్పుతో విభేదించి.. మైనారిటీ తీర్పు వెలువరించారు. ట్రిపుల్‌ తలాఖ్‌  రాజ్యాంగబద్ధమేనని, ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని పేర్కొన్నారు. ఈ విధానంపై ఆరు నెలల్లోపు పార్లమెంటులో చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ ఆరు నెల కాలంలో ట్రిపుల్‌ తలాఖ్‌ విధానాన్ని అనుసరించకుండా నిషేధం విధించాలని సిఫారసు చేశారు. అయితే, మెజారిటీ తీర్పే పరిగణనలోకి తీసుకోబడుతుంది.

రాజ్యాంగ ధర్మాసనంలోని జేఎస్‌ ఖేహర్‌, ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ ట్రిపుల్‌ తలాఖ్‌ను సమర్థించగా.. ఇతర న్యాయమూర్తులైన జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌.. ట్రిపుల్‌ తలాఖ్‌ రాజ్యాంగ విరుద్ధమంటూ మెజారిటీ తీర్పు వెలువరించారు. కాగా, ఇస్లాంలో భాగమైన సున్నీ వర్గం ప్రజలు గత వెయ్యేళ్లుగా ట్రిపుల్‌ తలాఖ్‌ విధానాన్ని అనుసరిస్తున్నారని జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ అన్నారు.

ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. వివాదాస్పదంగా మారిన మూడుసార్లు తలాఖ్‌ చెప్పే విధానం‌, బహుభార్యత్వం అంశంపై ఈ ఏడాది మే 11 నుంచి ఆరు రోజులపాటు వాదనలు కొనసాగాయి. ఇది మతపరమైన హక్కా? లేదా రాజ్యంగ బద్ధమైనదా? అన్న అంశంపైనే సుప్రీంలో వాదనలు జరిగాయి. మే 17న ఈ విషయంలో ముస్లిం మహిళల అభిప్రాయాలను సేకరించాలని కేంద్రానికి సూచిస్తూ తుది తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌లో ఉంచింది.

ట్రిపుల్‌ తలాఖ్‌ విధానానికి వ్యతిరేకంగా పలువురు మహిళలు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. కేవలం భర్త మూడుసార్లు 'తలాఖ్‌' అన్న పదాన్ని ఉచ్చరించడం ద్వారా భార్యకు విడాకులు ఇచ్చే ఈ విధానం వల్ల తాము ఎంతో నరకయాతన అనుభవిస్తున్నామని పలువురు బాధిత మహిళలు సుప్రీంకోర్టు గడప తొక్కారు.