ఆత్మాహుతి బాంబర్ను అడ్డుకుని.. ప్రాణాలర్పించిన బాలుడు!

10 Jan, 2014 14:31 IST|Sakshi
ఆత్మాహుతి బాంబర్ను అడ్డుకుని.. ప్రాణాలర్పించిన బాలుడు!

స్కూలు మొత్తాన్ని పేల్చేద్దామనుకున్న ఆత్మాహుతి బాంబర్ను అడ్డుకోడానికి తన ప్రాణాలు సైతం అర్పించాడో బాలుడు!! ఈ సంఘటన పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూంఖ్వా రాష్ట్రంలో జరిగింది. అక్కడి హంగు జిల్లాలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఐతెజాజ్ అనే ఈ బాలుడు ఆత్మాహుతి బాంబర్ను అడ్డుకోగా, అతడు అక్కడికక్కడే బాంబు పేల్చేసుకోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. తన ప్రాణాలు పోతాయని తెలిసినా.. స్కూలు గేటు నుంచి బాంబర్ను లోపలికి రాకుండా అడ్డుకోవడంతో వందలాది మంది విద్యార్థుల ప్రాణాలు దక్కాయి.

పాక్ వార్తా పత్రికలు ఆ బాలుడి త్యాగాన్ని ఘనంగా శ్లాఘించాయి. సామాన్యులు చూపించే ఇలాంటి ధైర్యం అందరికీ స్ఫూర్తినిస్తుందని, ఉగ్రవాదులపై పోరాడేందుకు ధైర్యం ఇస్తుందని డాన్ పత్రిక తన సంపాదకీయంలో తెలిపింది. గతంలో తెహరిక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎదుర్కొన్న మలాలా యూసఫ్జాయ్ ఉదంతాన్ని కూడా డాన్ ప్రస్తావించింది. ఆమెలాగే ఐతెజాజ్ హుస్సేన్ కూడా అసమాన ధైర్యసాహసాలు చూపించి, తన ప్రాణాలు అర్పించాడని తెలిపింది.

>
మరిన్ని వార్తలు