పుష్కరాల్లో రైల్వే సేవలపై అధికారుల సంతృప్తి

21 Aug, 2016 22:39 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పుష్కరాలకు వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తున్నామని, ఘాట్లలోనే రైల్వే టిక్కెట్ కౌంటర్లు ఏర్పాటు చేశామని రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ (క్యాటరింగ్ అండ్ ప్యాసింజర్ సర్వీసెస్) విజయభాస్కర్ పేర్కొన్నారు. పుష్కరాల తొలి రోజు నుంచి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. రైలులో సీటు కోసం ఎంతటి ప్రయాసనైనా ప్రయాణికులు లెక్కచేయడం లేదు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రయాణికులను తిరిగి వారి స్వస్థలాలకు సురక్షితంగా పంపేందుకు రైల్వే అధికారులు అహర్నిశలూ పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్కర ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని పుష్కరాల్లో రైల్వే సేవలపై ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు.

సాక్షి: పుష్కర రద్దీ బాగా ఉంది. రైల్వేశాఖ ఎలాంటి ఏర్పాట్లు చేసింది?
విజయభాస్కర్:
ఇతర ప్రయాణ సాధారణల చార్జీలతో పోల్చితే రైల్వే టిక్కెట్‌చార్జీలు చాలా తక్కువ. అందువల్ల పుష్కర ప్రయాణికులంతా రైల్వేలోనే ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతారు. రోజు మూడు లక్షల మంది ప్రయాణికులు రైల్వే సేవలను ఉపయోగించుకుంటారని భావించి ఐదు లక్షలు మంది వచ్చినా తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేశాం.షెడ్యుల్డ్ ైరె ళ్లు కాకుండా అదనంగా 650 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నాం. ఇవికాకుండా రద్దీని బట్టి అప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లు వే సి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాం.

సాక్షిః ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా?
విజయభాస్కర్:
దక్షిణభారత దేశంలోనే మొదటిసారిగా పున్నమి, పవిత్రసంగమం, బస్టాండ్‌లలో రైల్వే టిక్కెట్ మిషన్లు పెట్టి ప్రయాణికులకు టిక్కెట్లు అందచేస్తున్నాం. ఇవికాకుండా రెగ్యులర్ కౌంటర్లు కాకుండా 79 అదనపు టిక్కెట్ కౌంటర్లు ఏర్పాట్లు చేశాం. ఇవి 24 గంటలు పనిచేస్తున్నాయి. 520 మంది కమర్షియల్ సిబ్బంది రైల్వే ప్రయాణికుల సేవలో ఉన్నారు. ఆదివారం బాగా రద్దీ పెరిగినా పది నిముషాల్లో టిక్కెట్ తీసుకునే ఏర్పాటు చేశాం. చివర రోజు వరకు ఇంతే రద్దీ ఉంటుందని భావిస్తున్నాం.

సాక్షిః క్యాటరింగ్ సౌకర్యం ఎలా ఉంది? భక్తులకు నాణ్యమైన భోజనం అందుతోందా? ధరలు మాటేమిటీ?
విజయభాస్కర్:
ప్రతి ప్లాట్‌ఫాం పైనా 5 అదనంగా క్యాటరింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశాం. ప్రతి మూడు గంటలకు ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు, ఆఫీసర్లుతో ఆహారం శాంపిల్స్ తీసుకుని పరీక్షలు చేయిస్తున్నాం. హడావుడిగా రైలు ఎక్కే వారికి కూడా అందుబాటులో ఉండే విధంగా రైలు వద్దనే విక్రయాలు జరిగేటట్లు చూస్తున్నాం. పాలు, ప్రూట్ జ్యూస్, వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉంటున్నాయి. నిర్ణయించిన ధర కంటే ఏ మాత్రం ఎక్కువ రేటు అమ్మినా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించాం. నాణ్యత, ధరల విషయంలో ప్రయాణీకుల నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు లేదు.

సాక్షిః శాటిలైట్ స్టేషన్లలో సౌకర్యాలు మాటేమిటీ?
విజయభాస్కర్:
హైదరాబాద్ నుంచి హెచ్‌ఓడీలతో పాటు నేను ఇక్కడే ఉంటున్నాం. మధురానగర్, గుణదల, కృష్ణాకెనాల్, రాయనపాడు స్టేషన్లు తరుచుగా తనిఖీలు చేస్తున్నాం. అక్కడ ప్రయాణీకుల రద్దీని బట్టి టిక్కెట్‌కౌంటర్లు పెంచుతున్నాం. అక్కడ కూడా పదినిముషాల్లో టిక్కెట్ తీసుకుని రైలు ఎక్కవచ్చు. 24 గంటలు క్యాటరింగ్ సౌకర్యం ఉంది. శాటిలైట్ స్టేషన్లతో పాటు తారాపేట, పార్శిల్ ఆఫీసు, స్టేడియంలలో షెల్టర్స్(పుష్కరనగర్)లు ఏర్పాటు చేశాం. ప్రయాణికులు వీటిని బాగా ఉపయోగించుకుంటున్నారు.

సాక్షిః రైల్వేకి ఆదాయం ఎలా ఉంది?
విజయభాస్కర్: శనివారం వరకు సుమారు 11లక్షల మంది ప్రయాణికులు రైల్వే సేవలు వినియోగించుకున్నారు. సుమారు రూ.14.50 కోట్లు ఆదాయం వచ్చిందని అంచనా. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు 75వేల మంది ప్రయాణికులు రైల్వేస్టేషన్‌కు వచ్చారు. రాత్రికి ఇది రెట్టింపు అవ్వవచ్చు. పుష్కరాలు పూర్తయి భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయే వరకు ప్రత్యేక ఏర్పాట్లన్ని యధావిధిగా కొనసాగిస్తాం. భక్తులు క్షేమంగా ఇంటికి వెళ్లడమే మా ఉద్దేశం.

మరిన్ని వార్తలు