పార్లమెంటులో కొట్టుకున్నారు

27 Jan, 2017 09:07 IST|Sakshi
పార్లమెంటులో కొట్టుకున్నారు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ పార్లమెంట్‌ గురువారం రణరంగాన్ని తలపించింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరినొకరు కొట్టుకుంటూ తోసుకున్నారు. ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు వ్యతిరేకంగా సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీచేయాలని ఐదుగురు ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ అయాజ్‌ సాదిక్‌ను కోరడమే ఇందుకు కారణమని డాన్‌ న్యూస్‌ తెలిపింది. ఈ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌(పీటీఐ) నాయకుడు షా మహమూద్‌ ఖురేషి సభలో మాట్లాడుతుండగా ఆయన పార్టీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆ సమయంలో అధికార పీఎంఎల్‌ఎన్‌ సభ్యుడు షాహిద్‌ ఖాన్‌ అబ్బాసి.. ఖురేషి వద్దకు వెళ్లి తమ పార్టీ సభ్యులను అదుపుచేయమని విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. తమ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌పై అబ్బాసి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పీటీఐ సభ్యులు ఆరోపించారు. ఆ తరువాత ఇరు వర్గాల మధ్య బాహాబాహీ చోటుచేసుకున్నట్లు డాన్‌ న్యూస్ పేర్కొంది. సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది.

మరిన్ని వార్తలు