గద్దెనెక్కిన సమ్మక్క

19 Feb, 2016 07:44 IST|Sakshi
గద్దెనెక్కిన సమ్మక్క

* చిలుకలగుట్ట నుంచి మేడారానికి వచ్చిన వనదేవత
* జనంతో నిండిన మేడారం.. దారి పొడవునా భక్తి పారవశ్యం
* ఎదురుకోళ్లు, యాట బలులు, ఒడి బియ్యంతో భక్తుల మొక్కులు
* గాల్లోకి కాల్పులతో అమ్మవారికి అధికారిక స్వాగతం
* గురువారం ఒక్కరోజే 20 లక్షల మంది భక్తుల రాక
* నేడు భారీగా మొక్కులు చెల్లించుకోనున్న భక్తులు

సాక్షి ప్రతినిధి, వరంగల్: వనాలన్నీ జనాలతో నిండిపోయాయి.. సమ్మక్క నామస్మరణతో మార్మోగాయి.. మేడారం జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైంది!

లక్షల మంది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, అధికారుల లాంఛనాల మధ్య ఆదివాసీల వడ్డెలు(పూజారులు) వన దేవత సమ్మక్కను గురువారం చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెలపైకి చేర్చారు. నమో సమ్మక్క... జై సమ్మక్క... అంటూ భక్తులు మొక్కులు సమర్పించారు.

గిరిజన జాతరలో ఈ పతాక ఘట్టాన్ని చూసేందుకు లక్షల మంది భక్తులు తరలివచ్చారు. సమ్మక్క ఉండే చిలుకల గుట్ట జనంతో కిటకిటలాడింది. అక్కడ్నుంచి మేడారం వరకు 1.5 కిలోమీటర్ల దారి జనంతో నిండిపోయింది. చిలుకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్కను తీసుకువచ్చే గిరిజన జాతర ప్రధాన ఘట్టం సాయంత్రం 5.58 నుంచి రాత్రి 8.04 గంటల వరకు వైభవంగా సాగింది.
 
సమ్మక్క వచ్చిందిలా..
సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చే ప్రక్రియ గురువారం ఉదయమే మొదలైంది. సమ్మక్క వడ్డెలు ఉదయం 5.30 గంటలకు మేడారం సమీపంలోని చిలుకలగుట్ట అడవిలోకి వెళ్లి వనం (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాలు (కొత్త కుండలు) తెచ్చి గద్దెలపైకి చేర్చారు. అనంతరం కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు వడ్డెల బృందం సాయంత్రం 4 గంటలకు చిలుకలగుట్టపైకి బయల్దేరింది. అప్పటికే గుట్ట ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది.

కుంకుమ భరణి రూపంలో ఉన్న అడవి తల్లిని చేతబట్టుకొని సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య చిలుకలగుట్ట దిగారు. మిగిలిన వడ్డెలు కృష్ణయ్యను తోడ్కొని వచ్చారు. సమ్మక్క రాకకు సూచనగా ఆ దేవతను ఆహ్వానిస్తూ ప్రభుత్వం తరఫున అధికారిక లాంఛనాల ప్రకారం వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా ఏకే-47 తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ఏకే-47 తుపాకీ ట్రిగ్గర్‌ను నొక్కారు. సమ్మక్క రాకను సూచించే ఈ శబ్దంతో ఒక్కసారిగా చిలుకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగి పోయింది. సమ్మక్క నామస్మరణతో మార్మోగింది.

ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల నడుమ వడ్డెల బృందం సమ్మక్క రూపంతో మేడారం వైపు బయలుదేరారు. వంద మీటర్లు దాటగానే ఒకసారి, చిలుకలగుట్ట దాటే సమయంలో మరోసారి వరంగల్ రూరల్ ఎస్పీ తుపాకీ కాల్పులు జరిపి సమ్మక్కను ఆహ్వానించారు. అక్కడి నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆదివాసీ పూజారులు సమ్మక్కను మేడారం గద్దెలపైకి తరలించడం మొదలుపెట్టారు.
 
లక్షల మంది భక్తుల తన్మయత్వం
చిలుకలగుట్ట నుంచి మేడారం వరకు ఒకటిన్నర కిలోమీటరు పొడవునా లక్షల మంది భక్తులు సమ్మక్క రాకను చూసి తన్మయత్వం చెందారు. సమ్మక్కకు ఎదురుగా కోళ్లను, గొర్రెలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తులు పూనకాలతో ఊగారు. మొక్కుల కోసం తెచ్చుకున్న ఒడి బియ్యాన్ని దారిలో సమ్మక్కపై చల్లారు. కొందరు భక్తులు ఆ బియ్యాన్ని ఏరుకుని దాచుకున్నారు. సమ్మక్కను తీసుకొస్తున్న బృందం అక్కడ్నుంచి సెలపెయ్య గుడికి చేరుకుంది.

వనదేవత రావడంతో అక్కడి పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేడారం గద్దెలకు బయలుదేరారు. మేడారం గద్దెల ముఖద్వారం వద్ద ఆ ఊరి ఆడపడుచులు సమ్మక్కను తీసుకు వస్తున్న పూజారుల కాళ్లు కడిగి స్వాగతం పలికారు. అనంతరం పూజారులు సమ్మక్కను గద్దెలపైకి చేర్చారు. సమ్మక్క గద్దెలపైకి వచ్చే సమయంలో ఆవరణలో కరెంటు సరఫరాను నిలిపివేశారు. సమ్మక్క గద్దెలపైకి చేరిన తర్వాత కరెంటు సరఫరా కొనసాగించారు.

మొదట మేడారం వాసులు, జిల్లా అధికారులు మొక్కులు చెల్లించుకున్నారు. నలుగురు వన దేవతలు... సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలపైకి చేరడంతో మొక్కులు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. గురువారం అర్ధరాత్రి వరకు మేడారం ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది.

సమ్మక్కను గద్దెలపైకి తీసుకు వచ్చే కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ జి.పద్మ, మహబూబాబాద్ ఎంపీ ఎ.సీతారాంనాయక్, ఐటీడీఏ పీవో డి.అమయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను కిందికి తీసుకువచ్చిన తర్వాత తుడుందెబ్బ యువకులు, పోలీసులు... భక్తులను దూరంగా నెట్టివేసేందుకు ప్రయత్నించడంతో స్వల్పంగా తోపులాట జరిగింది.
 
ఒక్కరోజే 20 లక్షల మంది
సమ్మక్క గద్దెలపైకి చేరే రోజు కావడంతో గురువారం ఒక్క రోజే 20 లక్షల మంది మేడారానికి తరలివచ్చారు. శుక్రవారం సైతం భారీ సంఖ్యలో భక్తులు రానున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో నార్లాపూర్-ఊరట్టం క్రాస్ రోడ్డు ప్రాంతంలోని 5 కిలోమీటర్ల మేర వాహనాల ప్రయాణం చాలా నెమ్మదిగా సాగుతోంది. గద్దెలపై వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులకు సగటున గంటన్నర సమయం పడుతోంది.
 
నేడు మేడారానికి సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం వరంగల్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటలకు నేరుగా మేడారం చేరుకొని సమ్మక్క, సారలమ్మను దర్శించుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్‌కు చేరుకుంటారు. అనంతరం మడికొండలోని ఇన్‌క్యుబేషన్ టవర్‌ను ప్రారంభించి సియంట్ ఐటీ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తర్వాత సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు.

మరిన్ని వార్తలు