సెక్యూరిటీలపై రుణం కాస్త బెటర్!

29 Sep, 2013 01:02 IST|Sakshi
సెక్యూరిటీలపై రుణం కాస్త బెటర్!

రుణాలు రకరకాలు. వ్యక్తుల ఆర్థిక స్తోమత, తిరిగి చెల్లించే సామర్థ్యం, వారి అవసరాలను బట్టి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రకరకాల రుణాలిస్తున్నాయి. బంగారంపై రుణం, సెక్యూరిటీలపై రుణం(ఎల్‌ఏఎస్)... ఇవన్నీ ఇలాంటివే. ఎల్‌ఏఎస్ కింద షేర్లు, బీమా పాలసీ, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు తనఖా ఉంచుకుని వాటిపై రుణ మంజూరు చేస్తారు. ఏఏ సెక్యూరిటీలను అంగీకరిస్తారనేది బ్యాంకును బట్టి మారుతుంటుంది.

ప్రాథమికంగా మాత్రం...
నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు, మ్యూచ్‌వల్ ఫండ్ యూనిట్లు, నాబార్డ్ బాండ్లు, డీమ్యాట్ షేర్లు, యూటీఐ బాండ్లు, ఎన్‌ఎస్‌సీ/కేవీపీ సర్టిఫికెట్లు (డీమ్యాట్ రూపంలో ఉంటేనే...), బీమా పాలసీలను అంగీకరిస్తుంటారు.

ఎల్‌ఏఎస్ వల్ల అప్పటికప్పుడు మన దగ్గర అందుబాటులో ఉండే సెక్యూరిటీల్ని తొందరపడి విక్రయించాల్సిన అవసరం లేకుండా తనఖా పెట్టి రుణం తీసుకోవటం వీలవుతుంది. సెక్యూరిటీల్ని తనఖా పెడితే సదరు బ్యాంకు లేదా ఆర్థిక సేవల సంస్థ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్నిస్తుంది. ఓవర్‌డ్రాఫ్ట్ విలువ మాత్రం తను తనఖా ఉంచుకునే సెక్యూరిటీల విలువపై ఆధారపడి ఉంటుంది. లావాదేవీ సాఫీగా సాగాలంటే మీ పేరిట కరెంట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఆ ఖాతాలో పడే డబ్బును ఎప్పుడు ఎంత వాడుకోవచ్చు అన్నది మీ ఇష్టం. వడ్డీ కూడా విత్‌డ్రా చేసుకున్న సొమ్ముకే చెల్లించాల్సి ఉంటుంది. పెపైచ్చు ఎన్నాళ్లు ఆ సొమ్మును వాడితే ఆ కాలానికే వడ్డీ చెల్లించాలి. దీన్లో ఉన్న ప్రధాన ప్రయోజనమేంటంటే అవసరమైనపుడు కావలసిన సొమ్మును పొందటం. మరోవంక షేర్ హోల్డర్‌గా వచ్చే ప్రయోజనాల్ని కోల్పోకుండా ఉండటం. అంటే ఆ షేర్లపై మీకుండే హక్కులు, దానిపై వచ్చే డివిడెండ్లు, బోనస్‌లు, షేర్ ధర పెరిగితే ఆ ప్రయోజనం... వీటిలో దేన్నీ కోల్పోవాల్సిన అవసరం ఉండదు. పెపైచ్చు మిగతా రుణాలతో పోలిస్తే షేర్లపై తీసుకునే రుణానికి వడ్డీ తక్కువే.
 
ఎల్‌ఏఎస్ ముఖ్యాంశాలు...
మీ దగ్గరుండే బాండ్లు, షేర్లు, డిబెంచర్లు, మ్యూచువల్ ఫండ్లు తనఖాగా సెక్యూర్డ్ రుణాన్ని మంజూరు చేస్తారు.
ఎల్‌ఏఎస్ రుణ వ్యవధి సాధారణంగా ఏడాది. అవసరాన్ని బట్టి దీన్ని రెన్యువల్ చేసుకోవచ్చు.
సాధారణంగా ఎల్‌ఏఎస్ వడ్డీ రేట్లు 12 నుంచి 15 శాతం. కానీ ఇవి బ్యాంకును బట్టి మారుతుంటాయి.
దీనిపై దాదాపు 2 % ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
 
సాధారణంగా తనఖా పెట్టిన సెక్యూరిటీ విలువలో 50 శాతాన్ని రుణంగా మంజూరు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది పెరగవచ్చు కూడా.
ఈ రుణాన్ని ముందుగా తీర్చేయాలనుకుంటే ఎలాంటి ప్రీపేమెంట్ చార్జీలూ ఉండవు. తీర్చాలనుకున్నపుడు తక్షణం చెల్లించేయొచ్చు.
18 నుంచి 65 ఏళ్ల మధ్యవారు ఎవరైనా ఈ రుణానికి దరఖాస్తు చేయొచ్చు.
 
కావాల్సిన పత్రాలు: ఉద్యోగస్తులైతే పాన్ కార్డ్, గుర్తింపు పత్రం, ఫొటో, చిరునామా ధ్రువీకరణ, 6 నెలల బ్యాంకు స్టేట్‌మెంట్, చెక్కులు, డీమ్యాట్ ఖాతా స్టేట్‌మెంట్, ఆదాయ ధ్రువీకరణ అవసరం. స్వయం ఉపాధి పొందుతున్నవారికైతే పైన పేర్కొన్న వాటితో పాటు ఆదాయ ధ్రువీకరణ, ఆఫీసు చిరునామా ధ్రువీకరణ, వ్యాపార ధ్రువీకరణ, బ్యాలెన్స్ షీట్ అందజేయాల్సి ఉంటుంది.
 

మరిన్ని వార్తలు