మావోల కోట.. బస్తర్!

11 Nov, 2013 01:25 IST|Sakshi

బస్తర్ (ఛత్తీస్‌గఢ్): బస్తర్.. నక్సలైట్ల కంచుకోట. వారి రెడ్ కారిడార్‌లో కీలక ప్రాంతం.  మావోలు స్వేచ్ఛగా సంచరించగలిగే ఆదివాసీల గడ్డ. వారికి రక్షణ కల్పించేలా అడవులు, కొండలతో నిండిన నేల. దక్షిణ బస్తర్‌లోని 70 శాతం పూర్తిగా మావోల అధీనంలోనే ఉంది. సుక్మా, అబూజ్‌మఢ్, కాంకేర్, నారాయణపూర్.. తదితర ప్రాంతాల్లోనూ భద్రతా బలగాలు చేరగలిగే ప్రాంతాలు దాదాపు శూన్యం. అదీకాక స్థానిక గిరిజనుల్లో మావోలకు మంచి పట్టుంది. అటవీ అధికారులతో చేతులు కలిపి కాంట్రాక్టర్లు ఆదివాసీలతో వెట్టిచాకిరీ చేయిస్తున్న సమయంలో.. వారి బారినుంచి గిరిజనులను మావోయిస్టులు కాపాడారు.
 
 స్థానిక భూస్వాముల నుంచి భూములను లాక్కొని భూమిలేని ఆదివాసీలకు పంచిపెట్టారు. బీడీ ఆకులు సేకరించే గిరిజనులకు కనీస వేతనాల కోసం పోరాడుతున్నారు. వారు స్థానికుల్లో ఒకరుగా ప్రవర్తిస్తారు. ఈ కారణాలతో స్థానికులు మావోలకు బాగా దగ్గరయ్యారు. అంతేకాకుండా, ఎదిరించిన వారిని చంపేస్తారన్న భయం కూడా స్థానిక గిరిజనుల్లో ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ‘ఓటేస్తే చేతులు నరికేస్తామని నక్సలైట్లు బెదిరిస్తున్నారు కాబట్టి ఓటేసిన తరువాత వేలిపై చుక్క పెట్టకపోతేనే ఓటేస్తా’మని స్థానికులు అధికారులకు విన్నవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బస్తర్‌లో నేటి తొలివిడత ఎన్నికలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. సోమవారం ఎన్నికలు జరగనున్న 18 స్థానాల్లో 12 ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.
 
 నేపాల్ నుంచి నక్సలైట్లు: మావోయిస్టులు పోలింగ్ రోజు ఇక్కడ భారీ దాడులకు దిగే సన్నాహకాల్లో ఉన్నారని నిఘావర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. మావోయిస్టుల దళపతి గణపతి బస్తర్ డివిజన్‌లోని అబూజ్‌మఢ్‌లో మకాం వేసి దాడుల కోసం కేడర్‌ను సిద్ధం చేశారని తెలిపాయి. దాడుల కోసం నేపాల్ సహా పలు ప్రాంతాల నుంచి నక్సలైట్లు అబూజ్‌మఢ్ చేరుకున్నారని వెల్లడించాయి.

మరిన్ని వార్తలు