మా సమస్యలు పరిష్కరిస్తేనే ఓటేయండి!

6 Feb, 2014 02:08 IST|Sakshi

* బీజేపీ జాతీయ నాయకత్వంపై సీమాంధ్ర నేతల ఒత్తిడి

సాక్షి, హైదరాబాద్:  సీమాంధ్ర సమస్యలు పరిష్కరించే వరకు విభజన బిల్లుకు పార్లమెంటులో మద్దతు ఇవ్వొద్దని బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ పార్టీ జాతీయ నాయకత్వాన్ని డిమాండ్ చేసింది. ఉద్యమ కమిటీ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు, తదితరులు బుధవారం పార్టీ సీనియర్ నేతలు వెంకయ్య నాయుడు, రవిశంకర్ ప్రసాద్‌ను కలసి బిల్లుకు పది సవరణలను సూచించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సజావుగా సాగాలంటే ముంపునకు గురయ్యే భద్రాచలం ప్రాంతాన్ని సీమాంధ్రలోనే కలపాలని కోరారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించే అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మరోపక్క పార్టీ జాతీయ కమిటీ సభ్యుడు హరిబాబు నాయకత్వంలో మరికొంతమంది గురువారం ఢిల్లీకి వెళుతున్నారు. అద్వానీ, సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్‌లతో వీరు భేటీ కానున్నారు. సీమాంధ్ర నేతలకు పోటీగా తెలంగాణ బీజేపీ నేతలూ శుక్రవారం ఢిల్లీకి వెళుతున్నారు.

మరిన్ని వార్తలు