'కేంద్ర మంత్రులను బర్తరఫ్ చేయండి'

12 Feb, 2014 13:25 IST|Sakshi
'కేంద్ర మంత్రులను బర్తరఫ్ చేయండి'

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెన్షన్ చేసినట్లే ఆ ప్రాంత కేంద్రమంత్రులను కూడా  బర్తరఫ్ చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో గతంలో తాము ఏం చెప్పామో ప్రస్తుత సభలో అదే జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు, సీమాంధ్ర ప్రాంత అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. అందుకు ఆ పార్టీకి చెందిన సభ్యులే సభను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.

 

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి ఇదే మంచి ఉదాహరణ అని ఆయన తెలిపారు.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఎంత ముఖ్యమో, సీమాంధ్రకు సంపూర్ణ న్యాయం చేయడం కూడా అంతే ముఖ్యమని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. సీమాంధ్ర బిల్లు ప్రతులను బుధవారం  లోక్సభలో సభ్యులకు పంచిపెట్టారు. మరో వైపు సభలో రైల్వే మంత్రి మల్లిఖార్జున ఖార్గే రైల్వే బడ్జెట్ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు సభ వెల్ లోకి దూసుకొచ్చి  స్పీకర్ పోడియం చుట్టుముట్టారు.

 

అక్కడ సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దపెట్టున్న నినాదాలు చేశారు. సభ కార్యక్రమాలకు అడ్డుతగులుతున్న ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను మంగళవారం సస్పెన్షన్ చేసినట్లు, కేంద్రమంత్రులను కూడా బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎంపీ ప్రకాశ్ జావదేకర్ సూచించారు.

మరిన్ని వార్తలు