సమైక్య రైతు బేరి

16 Oct, 2013 03:34 IST|Sakshi
సమైక్య రైతు బేరి

సాక్షి నెట్‌వర్క్ : పండుగల్లేవు.. పబ్బాలేవు.. సెలవుల్లేవు.. విరామం లేదు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే లక్ష్యంగా ఉద్యమిస్తున్న సీమాంధ్ర ప్రజ వరుసగా 77వ రోజైన మంగళవారం కూడా సమైక్య ఉద్యమాన్ని ఉద్ధృతంగా చేపట్టింది. ఉద్యోగ జేఏసీ నేతలు కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని అన్ని మండలాల్లోనూ  రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి విభజన జరిగితే వ్యవసాయరంగానికి వచ్చే నష్టాల్ని వివరించారు.
 
 హోరెత్తిన రైతుగర్జనలు
 తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండల కేంద్రాల్లో రైతులు ర్యాలీలు చేసి విభజన యత్నాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రం ముక్కలైతే సస్యశ్యామలమైన కోనసీమ బీడువారి పోతుందని, నదీజలాల సమస్యలు తలెత్తి గోదావరి డెల్టా ఎండిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సీతానగరంలో జరిగిన రైతు గర్జనలో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి. మాజీ ఎమ్మెల్యే చిట్టూరి రవీంద్ర పాల్గొన్నారు. పెద్దాపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జనకు 500 మంది రైతులు ఎడ్ల బండ్లపై తరలివచ్చారు.
 
  జగ్గంపేట, రాజానగరం, తుని తదితర ప్రాంతాల్లో రైతులు, జేఏసీ నేతలు ర్యాలీలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు జంక్షన్‌లో ‘రైతుభేరి’ నిర్వహించారు.  పాలకొల్లు, చింతలపూడి, పెరవలి, శింగగూడెంలలో రైతు అవగాహన సదస్సులు నిర్వహించారు.  విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎన్జీఓలు కోర్టు జంక్షన్‌లో రహదారులను దిగ్భందించి మానవహారం నిర్మించారు. పార్వతీపురంలో ఏపీ ఎన్‌జీవోలు కేంద్ర మంత్రుల మాస్కులు వేసుకున్న వ్యక్తులకు గడ్డి తినిపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
 
 అన్నదాతల ధర్నా
 కృష్ణా జిల్లా పామర్రులో రైతులు నాలుగురోడ్ల కూడలిలో ధర్నా నిర్వహించారు. చల్లపల్లిలో వీఆర్వోలు, వీఆర్‌ఏలు రాస్తారోకో చేపట్టారు. జేఏసీ పిలుపు మేరకు అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రైతు సదస్సులు జరిగాయి. గుంటూరు జిల్లా పొన్నూరులో రైతులు ప్రదర్శన చేపట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో రైతుగర్జన పేరిట బహిరంగసభ నిర్వహించారు. ముందుగా రైతులు భారీ ర్యాలీగా సభాస్థలికి వస్తూ నాలుగురోడ్ల కూడలిలో మానవహారం చేపట్టారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎన్జీవోలు ర్యాలీ నిర్వహించి రాష్ట్రీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. ఒంగోలులో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎన్‌జీవోలు, రెవెన్యూ, ఇతర ఉద్యోగ సంఘాలన్నీ కలిసి జిల్లా కలెక్టరేట్ ఎదుట మానవహారం నిర్వహించాయి.
 
 సీమలో వినూత్న నిరసనలు
 అనంతపురంలో కార్పొరేషన్ ఉద్యోగులు మెడలో  ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోనియా గాంధీని రావణాసురుడిలా చిత్రీకరించి.. కేంద్ర మంత్రుల తలలు అటూ ఇటూ పెట్టి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని దహనం చేశారు. రాయదుర్గంలో రిలే దీక్షలు చేస్తున్న సమైక్యవాదులకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రతి ఇంటి ముందూ సమైక్యాంధ్ర అని రాసి ఉంచాలని కోరుతూ సమైక్యవాదులు పాదయాత్ర చేపట్టారు. మదనపల్లె-తిరుపతి ర హదారిపై కొత్తవారిపల్లి వద్ద రైతు గర్జన నిర్వహించారు. తిరుపతి గాంధీపురం శ్మశాన వాటిక లో సమాధి నిర్మించి, సోనియాగాంధీ బొమ్మ తగిలించారు. కర్నూలులో కలియుగ రావణాసురిగా సోనియాగాంధిని చిత్రీకరించి ఆమెకు పదితలలుగా ప్రధాని మన్మోహన్, కేంద్రమంత్రుల చిత్రాలను ఉంచారు. దానిపై టపాసులు పెట్టి కలెక్టరేట్ వద్ద దహనం చేశారు. చాగలమర్రిలో రైతు గర్జన సదస్సును నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో భారీ ర్యాలీ చేపట్టారు. రాజంపేటలో రైతులు ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో ఎన్జీఓలు కాగడాల ప్రదర్శనతోపాటు రోడ్డుపైన పడుకొని నిరసన చేపట్టారు.
 
 విభజనకు వ్యతిరేకంగా ఓటేస్తాం
 రాష్ర్ట శాసనసభలో అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తామని పలువురు ఎమ్మెల్యేలు మంగళవారం ఎన్జీవోలకు ప్రమాణం చేసి హామీపత్రాలను సమర్పించారు. విశాఖలో  తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ హామీ పత్రం ఇచ్చారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎన్జీవోలు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నివాసాన్ని ముట్టడించారు. తాను అసెంబ్లీలో విభజనకు వ్యతిరేకంగా ఓటేస్తామంటూ ఆయన ప్రమాణ పత్రాన్ని అందివ్వడంతో వారు శాంతించారు.

మరిన్ని వార్తలు