నేడు సీమాంధ్ర మంత్రుల భేటీ, ‘సమైక్య’ కార్యాచరణ

24 Jul, 2013 14:50 IST|Sakshi
నేడు సీమాంధ్ర మంత్రుల భేటీ, ‘సమైక్య’ కార్యాచరణ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంశంపై తుదినిర్ణయం తీసుకొనే దిశగా సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు భవిష్యత్ కార్యాచరణకు సన్నద్ధమవుతున్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని మంత్రుల క్వార్టర్లలోని క్లబ్‌హౌస్‌లో భేటీ కావాలని నిర్ణయించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించేలా అధిష్టానంపై ఒత్తిడి పెంచడానికి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడమే తప్ప ఇతర ఏరకమైన నిర్ణయాన్నీ తాము ఆమోదించేది లేదని హైకమాండ్‌కు స్పష్టం చేయాలని నిర ్ణయించారు.

ఇప్పటికే కొందరు మంత్రులు కార్యాచరణపై ముసాయిదా పత్రాన్ని రూపొందించారు. దీన్ని సమావేశంలో చర్చించాక తుది కార్యాచరణను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశం ద్వారా పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ప్రత్యేకంగా ఒక లేఖను పంపాలని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన దిశగా నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు, అవాంఛనీయ ఘటనలు తలెత్తే ప్రమాదముందని, చివరకు అవి రాష్ట్ర ప్రభుత్వ మనుగడను ప్రశ్నార్థకం చేసే పరిస్థితీ ఉంటుందని స్పష్టం చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో ఉద్యమకార్యాచరణనూ రూపొందించుకోనున్నారు. సమైక్యవాదాన్ని వినిపించే సంఘాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు సన్నాహాలు చేయాలన్నది వారి ఆలోచన. విభజనపై అధిష్టానం తక్షణ నిర్ణయమేదీ వెలువరించకుండా వాయిదా వేయించేలా ఉద్యమించాలని యోచిస్తున్నారు.

ఇందులో భాగంగా విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, విజయవాడ, రాజమండ్రి ఇలా పలు ముఖ్య పట్టణాల్లో సమైక్య సభలు నిర్వహించాలని, చివరిగా హైదరాబాద్‌లో భారీ సభను ఏర్పాటు చేయాలని ఇదివరకు భావించినా ఇప్పుడు ముందుగా హైదరాబాద్‌లోనే సభ పెట్టాలని భావిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతాల్లో సభలు నిర్వహించడం వల్ల ఫలితం ఉండదని, హైదరాబాద్ సభ ద్వారానే వేడిపుట్టించి పార్టీ అధిష్టానానికి తమ వైఖరిని స్పష్టం చేయాలన్నది సీమాంధ్ర మంత్రుల భావన. తెలంగాణ సాధనసభకు మాదిరే తామూ సమైక్యసాధన సభను చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి కోరనున్నారు. దీనిపై ఇప్పటికే పీసీసీ చీఫ్ బొత్సతో మంత్రులు మాట్లాడారు. అనుమతి ఇవ్వకుంటే కోర్టును ఆశ్రయించైనా సరే సభను నిర్వహించే యోచనలో ఉన్నారు. సభ తర్వాతి పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చని, వాతావరణం ఒక్కసారిగా వేడెక్కితే అధిష్టానం తెలంగాణపై సత్వర నిర్ణయం తీసుకోదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సమైక్యత కోసం కీలక నిర్ణయాలు: శైలజానాథ్

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదని, సమైక్యంగానే ఉంటుందని భావిస్తున్నామని మంత్రి శైలజానాథ్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తున్నారన్న ప్రచారం మీడియా సృష్టేనని మంగళవారమిక్కడ అన్నారు. అయితే రాష్ట్ర భవిష్యత్తు కీలక దశలో ఉన్నట్లు వార్తలు వస్తున్నందున తాము చేపట్టాల్సిన కార్యక్రమాలపై భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కాగా తెలంగాణపై అధిష్టానం నిర్ణయం తీసుకోబోయే తరుణంలో సభలు సరికాదని ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు