గర్జించిన గుంటూరు

20 Aug, 2013 03:37 IST|Sakshi
గర్జించిన గుంటూరు

సాక్షి, గుంటూరు: ఉద్యమాల పురిటి గడ్డ గుంటూరు గర్జించింది. సమైక్య నినాదాలు మిన్నంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమ న్యాయం చేయలేని కేంద్ర సర్కారుకు వాటిని విడగొట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నిస్తూ, న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు వెల్లువెత్తింది. ‘సమర దీక్ష’ శిబిరానికి పలు జిల్లాల నుంచి జనం వెల్లువలా కదిలి వచ్చారు. దివంగత వైఎస్సార్ ఆశయాల సాధనే లక్ష్యంగా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తున్న విజయమ్మకు బాసటగా నిలుస్తూ తొలి రోజు కార్యక్రమంలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రాణాలను లెక్క చేయకుండా, రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆమరణ దీక్ష తలపెట్టిన తెగువను మెచ్చుకున్నారు.
 
 విజయమ్మ హైదరాబాద్ నుంచి ఉదయాన్నే గన్నవరం విమానాశ్రయం చేరుకుని రోడ్డు మార్గాన గుంటూరు వచ్చారు.  విజయవాడ, మంగళగిరి, పెదకాకాని... ఇలా అడుగడుగునా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు వివిధ సమైక్య జేఏసీ సంఘాల నుంచి ఆమెకు ఘన స్వాగతం లభించింది. గుంటూరు, విజయవాడ పార్టీ నేతల ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీ నడుమ దీక్షా స్థలికి చేరుకున్నారు. నాగార్జున వర్సిటీ ప్రధాన ద్వారం దగ్గర జేఏసీ రిలే దీక్షల శిబిరం వద్ద ఆగి సంఘీభావం తెలిపారు. సరిగ్గా మధ్యాహ్నం 12.05కు దీక్షా శిబిరానికి చేరుకుని, తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సమర దీక్ష చేపట్టేందుకు దారితీసిన కారణాల్ని సమగ్రంగా వివరించారు. విభజన నిర్ణయంతో రాష్ట్రం అట్టుడుకుతుండటం చూసి జగన్ ఎంతో మథన పడుతున్నారన్నారు.
 
 నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారన్నప్పుడు, తండ్రిలా న్యాయం చేయలేనప్పుడు విభజించే హక్కు కేంద్రానికి ఎవరిచ్చారని  ప్రశ్నించినప్పుడు హర్షద్వానాలు మిన్నంటాయి. వైఎస్ ఆశయాలను, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నూటికి నూరుపాళ్లు అమలు చేస్తే రాష్ట్రాన్ని విడగొట్టాల్సిన అగత్యమే రాదనప్పుడు ‘వైఎస్సార్‌కు జోహార్లు’ అంటూ నినాదాలు మారుమోగాయి. రెండున్నరేళ్లు ఓదార్పు యాత్రతో జనం మధ్య గడిపిన తన బిడ్డ జగన్ ఈ రాష్ట్ర ప్రజల సమస్యలను దగ్గరగా చూసి చలించి, తండ్రి వైఎస్సార్ కలల్ని నిజం చేసేందుకు, ఆశయాలను సాధించేందుకు పూనుకోవడం చూసి కాంగ్రెస్‌కు కన్ను కుట్టిందన్నప్పుడు జనం కళ్లు చెమ్మగిల్లాయి. జగన్ జైల్లో ఉన్నా రాష్ట్ర ప్రజల బాగు కోసమే తపిస్తున్నారని, రెండు ప్రాంతాల ప్రజల ఆందోళన నేపథ్యంలో రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదని తనతో చెప్పారని విజయమ్మ వివరించారు. సమరదీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన అశేష జన స్పందనను జగన్‌కు తెలియజేస్తానని చెప్పగానే జనం జగన్‌కు జేజేలు పలికారు. పలికారు. మేధావులు, సమైక్యవాదుల ఆశీర్వచనాలతో సమర దీక్షను ప్రారంభిస్తున్నట్టు చెప్పి దీక్షకు కూర్చున్నారు.
 
 కిటకిటలాడిన గుంటూరు
 సమర దీక్ష శిబిరానికి తరలివచ్చిన సమైక్యవాదులతో గుంటూరు కిటకిటలాడింది. ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సీనియర్ సిటిజన్లు, మహిళలు, వికలాంగులు పార్టీ జెండాలు చేబూని వచ్చారు.  టీచర్స్ ఫెడరేషన్, ఏపీ ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ నేతలు విజయమ్మను కలిసి దీక్షకు సంఘీభావం తెలిపారు. దీక్షలో ఉన్న విజయమ్మకు వైద్య పరీక్షలు చేసేందుకు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వైద్య బృందం రాగా ఆమె తిరస్కరించారు.

మరిన్ని వార్తలు