ఎంపీ పదవికి సీనియర్‌ నటుడి రాజీనామా!

26 Dec, 2016 16:31 IST|Sakshi
ఎంపీ పదవికి సీనియర్‌ నటుడి రాజీనామా!

కోల్‌కతా: అనేక బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు మిథున్‌ చక్రవర్తి సోమవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. శారద చిట్‌ఫండ్‌ కుంభకోణంలో ఈడీ విచారణ ఎదుర్కొన్న ఆయన హఠాత్తుగా తన రాజ్యసభ స్వభ్యత్వానికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలు చూపి ఆయన పదవిని వదులుకున్నారు.

గత ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమ బెంగాల్‌లోని అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) తరపున ఆయన రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. అయితే, ఎంపీగా ప్రమాణం చేసేందుకే ఆయన నాలుగు నెలలు సమయం తీసుకున్నారు. ఈ క్రమంలో శారద చిట్‌ఫండ్‌ స్కాంలో ప్రమేయంపై ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టరేట్‌ (ఈడీ) ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే మిథున్‌ పదవిని వదులుకున్నట్టు తెలుస్తోంది. అధికార టీఎంసీకి సన్నిహితంగా ఉండటం, శారద స్కాంలో ఆరోపణలు రావడంతో ఆయన వ్యక్తిగతంగా, వృత్తిగతంగా కుంగిపోయారని, అందుకే ఎంపీ పదవిని వదులుకుంటున్నారని సన్నిహితులు చెప్తున్నారు. ఈ స్కాంలో ఈడీ నోటీసులు అందిన నాటి నుంచి ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారని వారు చెప్తున్నారు. మరోవైపు, వివిధ అంశాల్లో మోదీ ప్రభుత్వాన్ని తాను ప్రశ్నిస్తుండటంతో ఢిల్లీ సర్కార్‌ తనపై, తన పార్టీ నేతలపై ఈడీని, సీబీఐని ఉసిగొల్పుతున్నదని బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

నిజానికి శారద గ్రూప్‌తో అనుబంధమున్న వారిలో సంస్థ నుంచి తీసుకున్న డబ్బులు స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చిన ఏకైక వ్యక్తి మిథున్‌ చక్రవర్తియే. ఆయన గత ఏడాది జూన్‌ 16న స్వచ్ఛందంగా రూ. 1.19 కోట్ల చెక్కును తన లాయర్‌ ద్వారా ఈడీ కార్యాలయానికి పంపించారు. అంతేకాకుండా అప్పటినుంచి రాజ్యసభ సమావేశాలకు దూరంగా ఉన్నారు. అయితే, మిథున్‌ అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేశారని, ఇందులో రాజకీయకోణం లేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ అంటోంది. కాగా, పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన మిథున్‌ చక్రవర్తి తెలుగులో 'గోపాలా గోపాలా' సినిమాలో నటించారు.
 

మరిన్ని వార్తలు