సిమెంట్ షేర్లు డీలా

10 Jan, 2014 01:15 IST|Sakshi

 స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన స్టాక్ సూచీలు గురువారం మళ్లీ క్షీణించాయి. 125 పాయింట్ల శ్రేణిలో తిరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 16 పాయింట్ల నష్టంతో 20,713 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6 పాయింట్ల క్షీణతతో 6,168 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. శుక్రవారం ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తున్నారని బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. సిమెంటు, రియల్టీ షేర్లు క్షీణించగా, పీఎస్‌యూ, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఏసీసీ, అంబూజా సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 1-3% తగ్గాయి. జేపీ అసోసియేట్స్, డీఎల్‌ఎఫ్, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 2-4% పడ్డాయి. డివిడెండ్ల వార్తలతో కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, గెయిల్, బీపీసీఎల్ 2.5-3% మధ్య పెరిగాయి.
 
 ఇన్ఫీ కౌంటర్లో ఆప్షన్ బిల్డప్: ఫలితాల వెల్లడించనున్న సందర్భంగా డెరివేటివ్ విభాగంలో ఇన్ఫోసిస్ కౌంటర్లో జోరుగా ఆప్షన్ బిల్డప్ జరిగింది. రూ. 3,500, రూ. 3,600, రూ. 3,700 స్ట్రయిక్స్ వద్ద కాల్ బిల్డప్ జరిగింది. అన్నింటికంటే అధికంగా రూ. 3,700 స్ట్రయిక్ వద్ద 4.08 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఈ ఆప్షన్లో మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 7.69 లక్షలకు చేరింది. రూ. 3,400 నుంచి ప్రతీ రూ. 100 దిగువనా, రూ. 3,000 స్ట్రయిక్స్ వరకూ పుట్ బిల్డప్ జరిగింది. ఎక్కువగా రూ. 3,000 పుట్ ఆప్షన్లో 5.73 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 9.57 లక్షలకు పెరిగింది. అయితే క్యూ2 ఫలితాల వెల్లడిముందు గత అక్టోబర్‌లో జరిగిన ఆప్షన్ బిల్డప్‌తో పోలిస్తే ఈ దఫా ఆప్షన్ల రైటింగ్ తక్కువ. 3 నెలల క్రితం రూ. 200 తేడాతో రెండు వైపులా భారీగా కాల్స్, పుట్స్ రైటింగ్ జరిగినందున, అప్పట్లో ఇన్ఫోసిస్ కదలిక 3-4%కే పరిమితమైంది. కానీ ఇప్పుడు ఆప్షన్ల బిల్డప్ గత క్వార్టర్‌కంటే తక్కువగా వున్నందున, శుక్రవారం ఇన్ఫోసిస్ ఎటువైపైనా వేగంగా కదలవచ్చు. గరిష్టంగా రూ. 3,700 స్థాయి నిరోధించవచ్చని, కనిష్టంగా రూ. 3,000 స్థాయి మద్దతునివ్వవచ్చని పై ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది.
 

మరిన్ని వార్తలు