రియల్టీ, మెటల్ ర్యాలీ

24 Dec, 2013 01:04 IST|Sakshi
రియల్టీ, మెటల్ ర్యాలీ

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా వున్నా, దేశీయ స్టాక్ సూచీలు సోమవారం స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ట్రేడింగ్ తొలిదశలో 21,207 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన సెన్సెక్స్ చివరకు 21 పాయింట్ల లాభంతో 21.101 పాయింట్ల వద్ద ముగిసింది. 6,317-6,266 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 6,284 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.  కొద్ది రోజుల నుంచి స్తబ్దుగా వున్న రియల్టీ, మెటల్ షేర్లు మాత్రం జోరుగా పెరిగాయి. డీఎల్‌ఎఫ్, జేపీ అసోసియేట్స్ 3-5.5% మధ్య ర్యాలీ జరపగా, టాటా స్టీల్, జిందాల్ స్టీల్, హిందాల్కో 3-5% మధ్య ఎగిసాయి. బ్యాంకింగ్ షేర్లు ఐసీఐసీఐ, యాక్సిస్, పీఎన్‌బీ 1-2% మధ్య పెరగ్గా,  హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ 2% క్షీణించింది.  ఎఫ్‌ఐఐలు రూ. 135 కోట్ల  పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 38 కోట్ల నికర కొనుగోళ్లు జరిపాయి.
 
 నిఫ్టీలో లాంగ్ రోలోవర్స్ : డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో జనవరి నెలకు సోమవారం నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టుల లాంగ్ రోలోవర్స్ జోరుగా జరిగినట్లు తాజా డేటా వెల్లడిస్తున్నది. జనవరి నెలకు ఇన్వెస్టర్ల బుల్లిష్ ధోరణిని సూచిస్తూ జనవరి నిఫ్టీ ఫ్యూచర్ ప్రీమియం స్పాట్ ధరతో పోలిస్తే 76 పాయింట్లకు పెరిగిపోయింది. స్పాట్ నిఫ్టీ 6,284 వద్ద ముగియగా, జనవరి నిఫ్టీ ఫ్యూచర్ 6,360 వద్ద క్లోజయ్యింది. డెరివేటివ్ సిరీస్ ముగింపు మరో రెండు రోజులుందనగా, మరుసటి నెల ఫ్యూచర్ ప్రీమియం ఇంత భారీ స్థాయిలో పెరగడం అరుదు.
 
 అలాగే జనవరి నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టుల ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 52.48 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. దాంతో మొత్తం ఓఐ 1.32 కోట్ల షేర్లకు చేరింది. డిసెంబర్ సిరీస్ ప్రారంభానికి రెండు రోజుల ముందు...అంటే నవంబర్ 26న డిసెంబర్ నిఫ్టీ ప్రీమియం 59 పాయింట్లే వుంది. ఆ రోజున నిఫ్టీ ఓఐ 1.14 కోట్ల షేర్లే.  డిసెంబర్ సిరీస్ ముగింపు దగ్గరపడుతున్నా, ఈ నెల ఫ్యూచర్ ప్రీమియం కూడా స్వల్పంగా 17 పాయింట్ల నుంచి 18 పాయింట్లకు (6,302) పెరిగింది. డిసెంబర్ నిఫ్టీ 6,300 స్ట్రయిక్ కాల్ ఆప్షన్ నుంచి 4.76 లక్షల షేర్లు (7.34 శాతం) కట్‌కాగా, ఇదే స్ట్రయిక్ పుట్ ఆప్షన్లో 7.60 లక్షల షేర్లు (19.18 శాతం) యాడ్ అయ్యాయి. సూచీ లేదా షేరు మరింత పెరగవచ్చన్న అంచనాలతో కొనుగోలుచేసే ఫ్యూచర్ కాంట్రాక్టును లాంగ్ పొజిషన్‌గా వ్యవహరిస్తారు.

>
మరిన్ని వార్తలు