సెన్సెక్స్ 285 పాయింట్లు పతనం

26 Jul, 2013 04:20 IST|Sakshi
Markets

వరుసగా రెండోరోజు అమ్మకాలు వెల్లువెత్తడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ గురువారం భారీగా 285 పాయింట్లు క్షీణించింది. రూపాయి పతనాన్ని నియంత్రించడానికి రిజర్వుబ్యాంక్ చేపట్టిన చర్యల ఫలితంగా మార్కెట్లో నగదు లభ్యత తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం తాజా పతనానికి కారణం. ఈ రెండు రోజుల్లో సూచీ 500 పాయింట్ల వరకూ నష్టపోయింది. ఈ నెలలో భారీగా లాభపడ్డ ఎఫ్‌ఎంసీజీ షేర్లు హెచ్‌యూఎల్, ఐటీసీలు గురువారం 4 శాతం క్షీణించడంతో సూచీల్లో నష్టశాతం అధికంగా వుంది. సెన్సెక్స్‌లో ఎక్కువ వెయిటేజీ వున్న ఈ రెండు షేర్లే 140 పాయింట్ల నష్టానికి కారణమయ్యాయి.
 
 సిమెంటు, మెటల్స్, క్యాపిటల్ గూడ్స్ రంగాలకు చెందిన ఏసీసీ, గుజరాత్ అంబూజా, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, జేపీ అసోసియేట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్ అండ్ టీ, బీహెచ్‌ఈఎల్ షేర్లు సైతం బాగా నష్టపోయాయి. హీరో హోండా, టాటా మోటార్స్ షేర్లు పెరిగాయి. 20,110 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి పడిపోయిన సెన్సెక్స్ చివరకు వారంరోజుల కనిష్టస్థాయి 19,805 పాయింట్ల వద్ద ముగిసింది. 83 పాయింట్లు క్షీణించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 5,907 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. లిక్విడిటీని కట్టడి చేయడానికి రిజర్వుబ్యాంక్ తీసుకుంటున్న చర్యలు వికటిస్తాయని, ఆర్థికాభివృద్ధికి విఘాతం కలుగుతుందని భావిస్తున్న ఇన్వెస్టర్లు  రెండు రోజులుగా అమ్మకాలు జరుపుతున్నట్లు బ్రోకింగ్ వర్గాలు చెపుతున్నాయి. జూలై డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజైనందున, కొన్ని కౌంటర్లలో లాభాల స్వీకరణ జరగడం, బుల్స్ ఆన్‌లోడింగ్ కూడా సూచీల  పతనానికి మరో కారణమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రెండు ఎక్స్ఛేంజీల్లో క్యాష్ విభాగపు టర్నోవర్ రూ. 16,462 కోట్లకు పెరిగిపోయింది. ఎఫ్‌ఐఐలు రూ. 443 కోట్లు, దేశీయ సంస్థలు రూ. 138 కోట్ల చొప్పున నికర విక్రయాలు జరిపాయి.
 
 నిఫ్టీలో భారీ రోలోవర్స్.....
 గత కొద్ది నెలలుగా ఎన్నడూ లేనంతగా ఆగస్టు సిరీస్ నిఫ్టీ ఫ్యూచర్‌లో రోలోవర్స్ భారీగా జరిగాయి. నిఫ్టీ ఫ్యూచర్లో తాజాగా 33 లక్షల షేర్లు యాడ్‌కాగా, మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 1.80 కోట్ల షేర్లకు పెరిగింది. జూలై నెల డెరివేటివ్ సిరీస్ ప్రారంభానికి ముందురోజు (అంటే జూన్ సిరీస్ ముగిసిన రోజున)  1.19 కోట్ల షేర్ల ఓఐ వుంది. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ కౌంటర్లలో రోలోవర్స్ పటిష్టంగా ఉండటంతో మొత్తంగా నిఫ్టీలో కూడా ఓఐ పెరిగిపోయింది. దాదాపు రెండు వారాల నుంచి 200 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్న నిఫ్టీ రానున్న రోజుల్లో ఏదో ఒక దిశవైపు వేగంగా కదలవచ్చన్నది ఈ హెవీ రోలోవర్స్ సంకేతం.
 
 సిమెంట్ షేర్లలో షార్ట్ రోలోవర్స్....
 ఏసీసీ, అంబుజా సిమెంట్ కంపెనీల కార్యకలాపాల్ని విలీనపర్చే ప్రక్రియలో భాగంగా వాటి యాజమాన్య సంస్థ హోల్సిమ్ ప్రకటించిన ప్రణాళిక ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చడంతో ఆ రెండు షేర్లూ పతనమయ్యాయి. ఈ ప్రక్రియ ఫలితంగా అంబుజా సిమెంట్ మైనారిటీ షేర్‌హోల్డర్లకు జరిగే నష్టం ఎక్కువ వుంటుందన్న ఆందోళనతో ఆ షేరు 10 శాతంపైగా పతనమై ఏడాది కనిష్టస్థాయి రూ 162 స్థాయికి పడిపోయింది. ఏసీసీ కనిష్టస్థాయి నుంచి కోలుకుని 3 శాతం నష్టంతో రూ. 1195 వద్ద ముగిసింది. తాజా ప్రణాళిక ప్రకారం అంబుజా సిమెంట్ హోల్సిమ్‌కు కొత్త ఈక్విటీ షేర్లను జారీచేయాల్సివుంటుంది. ఈ జారీతో అంబుజా సిమెంట్స్ ఈక్విటీ 28 శాతం పెరిగిపోయి, 197 కోట్ల షేర్లకు చేరుతుంది. ఈ మొత్తం తతంగంతో సమీప భవిష్యత్తులో ఈ షేరు బలహీనంగా వుండవచ్చని అంచనావేస్తూ ఆగస్టు నెలకు ఆ కాంట్రాక్టులో షార్ట్ రోలోవర్స్ జరిగాయి. తాజాగా 33 లక్షల షేర్లు యాడ్‌కాగా మొత్తం ఓఐ 87 లక్షల షేర్లకు చేరింది. జూలై సిరీస్ తొలిరోజుల్లో ఈ కౌంటర్లో  48-49 లక్షల షేర్ల పరిమిత ఓఐ వుండేది. ఇక ఏసీసీ ఆగస్టు ఫ్యూచర్లో 83 వేల షేర్లు యాడ్‌కాగా, మొత్తం ఓఐ 4.10 లక్షల షేర్లకు పెరిగింది.

మరిన్ని వార్తలు