23వేల దిగువకు సెన్సెక్స్..

26 Feb, 2016 00:30 IST|Sakshi
23వేల దిగువకు సెన్సెక్స్..

‘ప్రభ’వించని రైల్వే బడ్జెట్
7,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ


స్టాక్ మార్కెట్ డేటా...
 
 టర్నోవర్ (రూ.కోట్లలో)
 బీఎస్‌ఈ    2,319
 ఎన్‌ఎస్‌ఈ (ఈక్విటీ విభాగం)    18,483
 ఎన్‌ఎస్‌ఈ (డెరివేటివ్స్)     5,95,640
 
 ఎఫ్‌ఐఐ     - 1,466
 డీఐఐ            807
 
 

 
రైల్వే బడ్జెట్ స్టాక్ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. ఫిబ్రవరి సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపుకు ప్రపంచ మార్కెట్ల బలహీనతలు కూడా తోడవడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ నష్టపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 23,000, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 113 పాయింట్లు నష్టపోయి 22,976 పాయింట్లకు, నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 6,971 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, ఐటీ, ఇన్‌ఫ్రా, క్యాపిటల్ గూడ్స్ షేర్లు నష్టపోగా, లోహ, ఫార్మా షేర్లు  లాభాల్లో ముగిశాయి. విదేశీ నిధులు తరలిపోతుండటంతో చైనా స్టాక్ సూచీ 6 శాతానికి పైగా క్షీణించడం, రూపాయి 30 నెలల కనిష్టానికి  పతనం కావడం,  ప్రతికూల ప్రభావం చూపాయి.సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది.
 
30 నెలల కనిష్టానికి రూపాయి

డాలర్‌తో రూపాయి మారకం గురువారం 30 నెలల కనిష్టానికి పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీలనుంచి నిధులు ఉపసంహరించు కోవడం, బ్యాంక్‌లు, దిగుమతిదారుల నుంచి  డాలర్లకు డిమాండ్ నేపథ్యంలో రూపాయి 15 పైసలు క్షీణించి 68.72 వద్ద ముగిసింది. నెల చివర కావడంతో దిగుమతిదారులు.. ముఖ్యంగా చమురు దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ బాగా ఉందని ఒక ఫారెక్స్ డీలర్ వ్యాఖ్యానించారు. ఫారెక్స్ మార్కెట్లో బుధవారం నాటి ముగింపుతో (68.57)తో పోల్చితే డాలర్‌తో రూపాయి మారకం గురువారం  68.47 వద్ద లాభాల్లోనే ప్రారంభమైంది.
   
ఎస్‌డీఆర్ నిబంధనల సవరణ
భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) వ్యూహాత్మక రుణ పునర్వ్యస్థీకరణ(ఎస్‌డీఆర్) నిబంధనలను సవరిం చింది. బ్యాంక్‌లు మొత్తం రుణ విలువలో 15 శాతం వరకూ ఎస్‌డీఆర్‌లకు కేటాయింపులు జరపాలని ఆర్‌బీఐ ఆదేశించింది. బ్యాంకులు తనఖాగా తీసుకున్న ఈక్విటీ విలువ మరింత తగ్గకుండా ఉండేలా ఈ నిబంధనలను ఆర్‌బీఐ రూపొందించింది. ఎస్‌డీఆర్ నిబంధనలో మరింత సరళత్వం కావాలని పలువురు కోరడంతో కొత్త నిబంధనలను ఆర్‌బీఐ అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకులు ఎస్‌డీఆర్ ద్వారా తీసుకున్న కంపెనీల్లోని వాటాను 18 నెలలలోపు కొత్త ప్రమోటర్లకు విక్రయించరాదని ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది.

మరిన్ని వార్తలు