సెన్సెక్స్ 378 పాయింట్లు డౌన్

11 Nov, 2015 01:15 IST|Sakshi
సెన్సెక్స్ 378 పాయింట్లు డౌన్

ఐదో రోజూ నష్టాలే
25,743 వద్ద ముగిసిన సెన్సెక్స్

 
అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో మంగళవారం కూడా స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. బిహార్ ఎన్నికల్లో మోదీకి ఎదురుదెబ్బ తగలడంతో ఆర్థిక సంస్కరణలకు అడ్డంకులు ఏర్పడుతాయనే ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొన్నది. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 378 పాయింట్లు క్షీణించి 25,743 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 132 పాయింట్లు క్షీణించి 7,783 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ.సెన్సెక్స్‌లకు ఇవి ఆరు వారాల కనిష్ట స్థాయిలు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 412 పాయింట్లు, నిఫ్టీ 142 పాయింట్లు నష్టపోయాయి. వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో  సెన్సెక్స్ 847 పాయింట్లు నష్టపోయింది. డిసెంబర్‌లోనే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాలు,  చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనమవుతోందంటూ తాజా సంకేతాలు వెలువడడం, అంతంతమాత్రంగానే ఉన్న కంపెనీల ఆర్థిక ఫలితాలు  ప్రభావం చూపాయి. రిఫైనరీ, లోహ, ఫార్మా, రియల్టీ, ఐటీ, టెక్నాలజీ, విద్యుత్తు షేర్లు పతనమయ్యాయి. 2071 సంవత్ సంవత్సరం చివరి రోజు స్టాక్ మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు.  2071 సంవత్ సంవత్సరంలో సెన్సెక్స్ 1,044 పాయింట్లు (3.89 శాతం), నిఫ్టీ 213 పాయింట్లు(2.65 శాతం) చొప్పున క్షీణించాయి. సంవత్ సంవత్సరాలను పరిగణనలోకి తీసుకుంటే పదేళ్ల కాలంలో సెన్సెక్స్ ఇంత అధ్వాన పనితీరు కనబరచడం ఇది మూడోసారి.
 
 స్పెషల్ మూరత్ ట్రేడింగ్
 దీపావళి సందర్భంగా నేడు(బుధవారం) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో సాధారణ ట్రేడింగ్ వుండదు. అయితే ప్రత్యేక మూరత్ ట్రేడింగ్ జరగనున్నది. సాయంత్రం 5.45 నుంచి 6.45 వరకూ గంట పాటు ఈ ట్రేడింగ్ జరుగుతుంది. బలిపాడ్యమి కారణంగా గురువారం స్టాక్ మార్కెట్‌కు సెలవు.
 

మరిన్ని వార్తలు