సెన్సెక్స్ 245 పాయింట్లు పతనం

31 Jul, 2013 03:29 IST|Sakshi
సెన్సెక్స్ 245 పాయింట్లు పతనం

రూపాయి పతనాన్ని నియంత్రించడానికి రిజర్వుబ్యాంకు తాజా పరపతి విధానంలో ఎటువంటి చర్యలూ ప్రకటించకపోగా, జీడీపీ వృద్ధి రే టు అంచనాల్ని తగ్గించడంతో స్టాక్ మార్కెట్లో మంగళవారం అమ్మకాలు వెల్లువెత్తాయి. మార్కెట్ క్షీణించడం వరుసగా ఇది ఐదో రోజు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 245 పాయింట్లు పతనమై 19,348 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచి 76 పాయింట్ల క్షీణతతో 5,755 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ 5 రోజుల్లో సెన్సెక్స్ 950 పాయింట్లు పతనమయ్యింది.  
 
 ఆర్‌బీఐ పరపతి విధాన ప్రకటన చేసిన తర్వాత రూపాయి నాటకీయంగా 60 స్థాయి దిగువను తాకడంతో ఆందోళన చెందిన ఇన్వెస్టర్లు హఠాత్తుగా అమ్మకాలకు పాల్పడ్డారు. కొద్ది రోజుల నుంచి మార్కెట్ తగ్గుతున్నా, గరిష్టస్థాయిలో ట్రేడవుతున్న ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు మంగళవారం నిట్టనిలువునా కుప్పకూలాయి. ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3-11 శాతం మధ్య పడిపోయాయి. అడాగ్ గ్రూప్ షేర్లు రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్‌లు 3-7 శాతం మధ్య తగ్గాయి. రియల్టీ, ఆటోమొబైల్ షేర్లకు సైతం అమ్మకాల సెగ తగిలింది. ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఐటీసీ, హెచ్‌యూఎల్ కౌంటర్లలో లాభాల స్వీకరణ కొనసాగింది. అయితే రూపాయి పతనంతో లబ్దిపొందే ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ , విప్రో, ఎంఫసిస్‌లు, ఫార్మా షేరు సన్‌ఫార్మాలకు కొనుగోలు మద్దతు లభించడంతో పటిష్టంగా ముగిసాయి. సూచీలు పడిపోయినా, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 256 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు జరపడం విశేషం.  దేశీయ సంస్థలు భారీగా రూ. 415 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించాయి.
 
 నిఫ్టీ 5,700 స్ట్రయిక్ వద్ద పుట్ బిల్డప్... కొన్ని హెవీవెయిట్ షేర్లలో భారీ అమ్మకాలు జరిగినప్పటికీ, డెరివేటివ్స్ విభాగంలో నిఫ్టీ 5,700 స్ట్రయిక్ వద్ద చెప్పకోదగ్గ పుట్ బిల్డప్ జరిగింది. ఈ పుట్ ఆప్షన్లో తాజాగా 18 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 54.60 లక్షల షేర్లకు పెరిగింది. నిఫ్టీ 5,800 దిగువన ముగిసినా, ఈ స్ట్రయిక్ వద్ద కూడా స్వల్పంగా పుట్‌రైటింగ్ జరగడంతో ఓఐ 47.71 లక్షల షేర్లకు చేరింది. అయితే 5,800 స్ట్రయిక్ కాల్ ఆప్షన్లో 11.50 లక్షల షేర్లు యాడ్ అయినా, మొత్తం ఓఐ స్వల్పంగా 29.12 లక్షల మేరకే చేరింది.  సమీప భవిష్యత్తులో సూచీ ఫలానా స్థాయి దిగువకు తగ్గదన్న అంచనాలతో ఇన్వెస్టర్లు పుట్ ఆప్షన్లను విక్రయించడంవల్ల ఈ తరహా పుట్ బిల్డప్ జరుగుతుంది. ఒక నిర్దేశితస్థాయిని మించి సూచీ పెరగదన్న అంచనాలతో ఆ స్ట్రయిక్ వద్ద కాల్ ఆప్షన్లను విక్రయిస్తే, దానిని కాల్ బిల్డప్‌గా వ్యవహరిస్తారు.

మరిన్ని వార్తలు