స్వల్ప హెచ్చుతగ్గులు

14 Sep, 2013 02:57 IST|Sakshi
స్వల్ప హెచ్చుతగ్గులు

ఇన్వెస్టర్లను ప్రభావితం చేయగల అంశాలేవీ లేకపోవడంతో వరుసగా మూడో రోజు మార్కెట్లు నత్తనడక నడిచాయి. అయితే రోజు మొత్తంలో స్వల్పశ్రేణిలో పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. సెన్సెక్స్ ఒక దశలో గరిష్టంగా 19,899ను, కనిష్టంగా 19,676 పాయింట్లను తాకింది. చివరికి 49 పాయింట్లు క్షీణించి 19,733 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ మాత్రం యథాతథంగా 5,851 వద్దే స్థిరపడింది. ఇందుకు గత రెండు వారాల్లో మార్కెట్లు 10% పుంజుకోవడం కూడా కారణంగా నిలుస్తోంది. ప్రధాని ఆర్థిక సలహాదారు రంగరాజన్ జీడీపీ వృద్ధి అంచనాను 6.4% నుంచి 5.3%కు కుదించడం కూడా కొంతమేర సెంటిమెంట్‌ను బలహీనపరచింది. వచ్చే వారం ఇటు రిజర్వ్ బ్యాంక్, అటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షలు ఉండటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు.
 
 ఐటీ షేర్లు డీలా
 బీఎస్‌ఈలో రియల్టీ, పవర్, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 2.5% స్థాయిలో పుంజుకోగా వినియోగ వస్తువులు, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌లు 1.5-1% మధ్య క్షీణించాయి. దిగ్గజాలలో విప్రో అత్యధికంగా 3.6% పతనంకాగా, టాటా స్టీల్, ఐటీసీ, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, భారతీ, టీసీఎస్, హెచ్‌యూఎల్ 1.5-1% మధ్య నష్టపోయాయి. అయితే మరోవైపు భెల్ 5.6% ఎగసింది. ఈ బాటలో కోల్ ఇండియా, ఎల్‌అండ్‌టీ, టాటా పవర్, హీరో మోటో, ఎంఅండ్‌ఎం 3-2% మధ్య పుంజుకున్నాయి.  
 
 వెలుగులో చిన్న షేర్లు?
 మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.6%  బలపడ్డాయి. బీఎస్‌ఈ-500లో కోల్టేపాటిల్ 17% దూసుకెళ్లగా సింటెక్స్, ఫినోలె క్స్, పటేల్ ఇంజినీరింగ్, యూబీ హోల్డిం గ్స్, జేకే లక్ష్మీ సిమెంట్, బాంబే డయింగ్, బిల్ట్, జేపీ పవర్, లవబుల్ లింగరీ తదితరాలు 11-7% మధ్య జంప్‌చేశాయి. ఎఫ్‌ఐఐలు రూ. 98 కోట్లు, దేశీయ ఫండ్స్ రూ. 152 కోట్లు చొప్పున అమ్మకాలు జరిపాయి.

మరిన్ని వార్తలు