మరో 68 పాయింట్లు డౌన్

8 Aug, 2013 02:24 IST|Sakshi
మరో 68 పాయింట్లు డౌన్
డాలరుతో మారకంలో రూపాయి విలువ మరో కొత్త కనిష్టాన్ని తాకడంతో స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీంతో వరుసగా రెండో రోజు సెన్సెక్స్ ఒడిదొడుకులను ఎదుర్కొంది. 18,811-18,551 పాయింట్ల మధ్య ఊగిసలాడి చివరకు 18,665 వద్ద స్థిరపడింది. ఇది 68 పాయింట్ల నష్టంకాగా, నిఫ్టీ కూడా 23 పాయింట్లు క్షీణించింది. 17 వారాల కనిష్టమైన 5,519 వద్ద నిలిచింది. అయితే మార్కెట్ల ట్రెండ్‌కు విరుద్ధమైన రీతిలో చిన్న షేర్లు పుంజుకున్నాయి. బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.3% లాభపడగా, మిడ్ క్యాప్ 0.7% బలపడింది. వెరసి ట్రేడైన మొత్తం షేర్లలో 1,249 లాభపడగా, 1,042 నష్టపోయాయి. ఏప్రిల్-జూన్ కాలానికి కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ 1.7% స్థాయిలో వృద్ధి చెందడంతో ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలలో కోత విధించవచ్చునన్న అంచనాలు బలపడుతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో డాలర్ల పెట్టుబడులు వెనక్కుమళ్లుతాయన్న ఆందోళనతో అమ్మకాలు కొనసాగుతున్నాయని విశ్లేషించారు. 
 
 రియల్టీ హైజంప్
 ప్రధానంగా ఐటీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 1.5% స్థాయిలో డీలాపడగా, రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 5% ఎగసింది. 
 
 ఐటీ షేర్లపై ఫండ్స్ మక్కువ
 న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీలపై దేశీయ మ్యూ చువల్ ఫండ్స్‌కు మక్కువ పెరుగుతోంది. జూన్ చివరికి ఐటీ రంగ షేర్లలో ఫండ్స్ మొత్తం పెట్టుబడులు రూ. 18,430 కోట్లకు చేరాయి. ఇవి మూడు నెలల గరిష్టంకాగా, ఫండ్స్ నిర్వహణలోగల మొత్తం ఆస్తులలో(ఏయూఎం)  10% వాటాకు సమానం. సెబీ గణాంకాల ప్రకారం జూన్ 30కల్లా ఫండ్స్ ఏయూఎం రూ. 1.80 లక్షల కోట్లుగా నమోదైంది.
 
మరిన్ని వార్తలు