నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

22 Aug, 2016 10:36 IST|Sakshi

ముంబై : ఫ్లాట్గా ప్రారంభమైన సోమవారం నాటి స్టాక్ మార్కెట్లు.. మరింత నష్టాల పాలవుతున్నాయి. సెన్సెక్స్ 131 పాయింట్ల నష్టంతో 27,945 వద్ద, నిఫ్టీ 43.25 పాయింట్ల నష్టంతో 8623 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఆర్బీఐకి కొత్త గవర్నర్గా ఉర్జిత్ పటేల్ పేరు ఖరారైన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించి లాభాల్లో ట్రేడ్ అవుతాయని మార్కెట్ విశ్లేషకులు అంచనావేశారు. కానీ ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్ తోపాటు ఆటో, మెటల్, బ్యాంకింగ్ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో దేశీయ సూచీలు నష్టాలను చవిచూస్తున్నాయి.

అదానీ పోర్ట్స్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, హెచ్యూఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. టీసీఎస్, లుపిన్, టాటా స్టీల్ నష్టాల బాట పట్టాయి. భారత్లో అతిపెద్ద టెక్స్టైల్ తయారీదారి వెల్సపన్ ఇండియా 20 శాతం మేర పతనమవుతున్నాయి. వెల్సపన్ ఇండియాతో ఉన్న తన వ్యాపారాలన్నింటినీ టార్గెట్ కార్పొ మూసివేస్తున్నట్టు  బ్లూమ్బర్గ్ రిపోర్టు వెలువడిన అనంతరం ఈ కంపెనీ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి. నిఫ్టీ తన కీలక మార్కు 8600 కంటే పడిపోతే, ఊపందుకునే బుల్లిష్ ట్రెండ్ను మార్కెట్లు కోల్పోతాయని ఏంజెల్ బ్రోకింగ్ తన రీసెర్చ్ నోట్లో తెలిపింది.


అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.13 పైసలు బలహీనపడి 67.19గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం కూడా 167 రూపాయల నష్టంతో 31,237వద్ద ట్రేడ్ అవుతోంది.

మరిన్ని వార్తలు