ఆర్‌బీఐ ఎఫెక్ట్.. 248 పాయింట్ల ర్యాలీ

19 Dec, 2013 03:04 IST|Sakshi

మార్కెట్ ను ఆశ్యర్యపరుస్తూ రిజర్వుబ్యాంక్ పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా వుంచడంతో బుధవారం స్టాక్ సూచీలు ర్యాలీ జరిపాయి. వరుసగా ఆరు రోజుల పతనానికి బ్రేక్‌వేస్తూ బీఎస్‌ఈ సెన్సెక్స్ 20,917 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ ర్యాలీ సాగించింది. చివరకు క్రితం ముగింపుకంటే 248 పాయింట్ల పెరుగుదలతో 20,860 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 78 పాయింట్లు ఎగిసి 6,217 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
 
 అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఈ దఫా సమీక్షలో వడ్డీ రేట్ల పెంపు తప్పదన్న అంచనాలతో మార్కెట్ వరుస క్షీణతను నమోదుచేస్తున్నది. ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 714 పాయింట్లు పతనమయ్యింది. తాజా ర్యాలీలో రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, పవర్ షేర్లు జోరుగా పెరిగాయి. డీఎల్‌ఎఫ్, బీహెచ్‌ఈఎల్, టాటా పవర్‌లు 4-6 శాతం మధ్య పెరిగాయి. రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్ సీ బ్యాంక్, ఎస్‌బీఐలు 2-3% మధ్య పెరిగాయి.  బ్యాంకింగ్ షేర్లలో లార్జ్‌క్యాప్స్‌కంటే మిడ్‌సైజ్ పీఎస్‌యూ బ్యాంకు షేర్లు పెద్ద ర్యాలీ జరిపాయి. రంగాలవారీగా అన్నింటికంటే ఎక్కువగా రియల్టీ ఇండెక్స్ 3.5% ర్యాలీచేయగా, బ్యాంకింగ్ ఇండెక్స్ 1.4% పెరిగింది.
 
 ఎఫ్‌ఐఐలు రూ. 1,196 కోట్ల నిధుల్ని కుమ్మరించగా, డీఐఐలు రూ. 413 కోట్లు వెనక్కు తీసుకున్నాయి. టెస్కో వాటా కొనుగోలుచేయడంతో ట్రెంట్ 10% ఎగిసింది.
 
 ఫెడ్ నిర్ణయం కోసం ఎదురుచూపు...
 ఇన్వెస్టర్ల అంచనాలకు భిన్నంగా వడ్డీ రేట్లు పెంపునకు బ్రేక్‌వేసినప్పటికీ, ఆర్‌బీఐ చర్యకు మార్కెట్ తగినంతగా పెరగలేదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. రేట్ల పెంపు అంచనాలతో గతవారం రోజుల్లో 3 శాతంపైగా క్షీణించిన సూచీలు, ఆర్‌బీఐ నిర్ణయం తర్వాత 1.2 శాతమే పెరిగాయి. రానున్న ఫెడ్ నిర్ణయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించడమే చిన్నర్యాలీకి కారణమని ఆ వర్గాలు విశ్లేషించాయి. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఉపసంహరణను ప్రారంభించనున్నట్లు ఫెడ్ ప్రకటిస్తే ఇక్కడ వడ్డీ రేట్లు హఠాత్తుగా పెరిగే అవకాశం వుందన్న భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయని, టాపరింగ్ వాయిదాపడితే గురువారం సూచీలు మరికొంత పెరిగే ఛాన్స్ వుందని ఆ వర్గాలు వివరించాయి.
 
 నిఫ్టీలో లాంగ్ బిల్డప్
 ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మ్యాజిక్ ఫలితంగా నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో లాంగ్ బిల్డప్ జరిగినట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. డిసెంబర్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టుల ముగింపునకు మరో ఐదురోజులే గడువు ఉన్నా, తాజాగా నిఫ్టీ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 1.76 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 2.20 కోట్లకు చేరింది. స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 32 పాయింట్లకు పెరిగిపోయింది. స్పాట్ నిఫ్టీ 6,117 పాయింట్ల వద్ద ముగియగా, ఫ్యూచర్ 6,249 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. క్రితం రోజు ఈ ప్రీమి యం 21 పాయింట్లే. డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు దగ్గరపడుతున్నా, ఇలా ప్రీమియం పెరిగిపోవడం భారీ షార్ట్ కవరింగ్‌ను, లాంగ్ బిల్డప్‌ను సూచిస్తుంది. అలాగే ఫెడ్ నుంచి ప్రతికూల నిర్ణయం ఏదైనా వెలువడితే తప్ప, నిఫ్టీ 6,200 దిగువకు తగ్గకపోవొచ్చన్న అంచనాలతో ఈ స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ జరిగింది. దాంతో 6,200 పుట్ ఆప్షన్ ఓఐలో 16.18 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇదే సమయంలో 6,300 స్ట్రయిక్ వద్ద స్వల్పంగా కాల్ రైటింగ్ జరగడంతో 80 వేల షేర్లు యాడ్ అయ్యాయి. సాధారణ పరిస్థితుల్లో 51 లక్షల షేర్ల పుట్ బిల్డప్ కలిగిన 6,200 స్థాయి  నిఫ్టీకి మద్దతునివ్వవచ్చని, 71.50 లక్షల షేర్ల కాల్ బిల్డప్ వున్న 6,300 స్థాయి నిఫ్టీ పెరుగుదలను నిరోధించవచ్చని ఆప్షన్ రైటింగ్ విశ్లేషిస్తున్నది.
 

మరిన్ని వార్తలు