టెలికం షేర్లు డీలా

17 Jan, 2014 05:51 IST|Sakshi
టెలికం షేర్లు డీలా

రానున్న స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు 8 కంపెనీలు బిడ్స్ దాఖలు చేయనున్న వార్తలు టెలికం షేర్లను పడగొట్టాయి. రిలయన్స్ జియో ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికం సేవలకు సిద్ధపడటం మరోసారి పోటీకి తెరలేపనుందన్న అంచనాలు టెలికం షేర్లలో అమ్మకాలకు కారణమైనట్లు నిపుణులు విశ్లేషించారు. దీనికితోడు పెరగనున్న పోటీ నేపథ్యంలో క్రెడిట్ సూసీ టెలికం షేర్ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని వివరించారు.

వెరసి ఐడియా సెల్యులార్ 7% పతనంకాగా, భారతీ ఎయిర్‌టెల్ 5%, ఆర్‌కామ్ 4%, టాటా టెలీ 3.3%, టాటా కమ్యూనికేషన్, ఎంటీఎన్‌ఎల్ 2% చొప్పున నష్టపోయాయి. కాగా, మరోవైపు మార్కెట్లు స్థిరీకరణ బాటలో సాగుతూ అక్కడక్కడే సంచరించాయి. 21,484-21,265 పాయింట్ల మధ్య కదిలిన సెన్సెక్స్ చివరికి 24 పాయింట్లు క్షీణించి 21,265 వద్ద ముగిసింది. నిఫ్టీ అయితే 2 పాయింట్ల నామమాత్ర నష్టంతో 6,319 వద్ద నిలిచింది. ఇక ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించిన కోల్ ఇండియా మరో 2.6% లాభపడింది.
 
 ఇన్ఫీకి పూర్వవైభవం
 మార్కెట్ల గమనాన్ని ప్రతిబింబించే ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలపై చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపగల వెయిటేజీని ఇన్ఫోసిస్ తిరిగి సాధించింది. నిఫ్టీలో 8.67% వెయిటేజీ పొందడం ద్వారా ఐటీసీ(8.66%)ను రెండో స్థానంలోకి నెట్టింది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫోసిస్ 0.3% లాభపడి రూ. 3,722 వద్ద ముగియగా, ఐటీసీ 0.7% క్షీణించి రూ. 327 వద్ద నిలిచింది.

మరిన్ని వార్తలు