8 రోజుల్లో 1,138 పాయింట్లు లాస్

3 Aug, 2013 03:18 IST|Sakshi
8 రోజుల్లో 1,138 పాయింట్లు లాస్

డాలరుతో మారకంలో రూపాయి మరోసారి భారీగా పతనంకావడంతో ఇన్వెస్టర్లు కంగుతిన్నారు. రూపాయి 1% దిగజారి 61కు చేరింది. దీనికితోడు స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్) సమస్యలతో ఫైనాన్షియల్ టెక్నాలజీస్, ఎంసీఎక్స్ షేర్లు వరుసగా రెండో రోజు కుప్పకూలడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో మిడ్ సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి సెన్సెక్స్ 153 పాయింట్లు క్షీణించి 19,164 వద్ద ముగిసింది. దీంతో వరుసగా 8వ రోజు నష్టాలను నమోదుచేసుకోవడంతోపాటు మొత్తం 1,138 పాయింట్లను కోల్పోయింది. అయితే గురువారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను మరింత సరళీకరిస్తూ ఆర్థిక మంత్రి చిదంబరం తీసుకున్న నిర్ణయాలకుతోడు, అమెరికా మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకుతుండటం కూడా ఇన్వెస్టర్లలో జోష్‌నింపింది. ఫలితంగా ఉదయం సెషన్‌లో సెన్సెక్స్ గరిష్టంగా 19,452 పాయింట్లకు చేరింది. చివర్లో పెరిగిన అమ్మకాలతో 19,078 వద్ద కనిష్టాన్ని సైతం తాకింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 50 పాయింట్లు పతనమై 5,678 వద్ద నిలిచింది.
 
 రియల్టీ పల్టీ
 బీఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ, పవర్, మెటల్ రంగాలు 4% స్థాయిలో జారుకోగా, వినియోగ వస్తు ఇండెక్స్ 5.4% ఎగసింది. టైటన్ ఇండస్ట్రీస్, పీసీ జ్యువెలర్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్ 9-5% మధ్య పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. కాగా, సెన్సెక్స్‌లో జిందాల్ స్టీల్ 7.3% నీరసించగా, కోల్ ఇండియా, టాటా పవర్, స్టెరిలైట్, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ 6-3% మధ్య తిరోగమించాయి. అయితే మరోవైపు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఆర్‌ఐఎల్ 1.7-0.6% మధ్య లాభపడ్డాయి.
 
 ఇక చిన్న షేర్లలో అమ్మకాలు కొనసాగడంతో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.3% పతనమైంది. ట్రేడైన షేర్లలో 1,491 నష్టపోగా, 775 లాభపడ్డాయి. ఎఫ్‌ఐఐలు రూ. 284 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 341 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి.

మరిన్ని వార్తలు