సెన్సెక్స్‌ కీలక మద్దతు 38,380 

30 Sep, 2019 03:59 IST|Sakshi

మార్కెట్‌ పంచాంగం

పది శాతం ర్యాలీ జరపడం ద్వారా మార్కెట్‌ కార్పొరేట్‌ పన్ను తగ్గింపు అంశాన్ని దాదాపు డిస్కౌంట్‌ చేసుకున్నట్లే. పన్ను లబ్ధి కలగకుండా పెరిగిన షేర్లు తగ్గడం, పన్ను ప్రయోజనాన్ని పూర్తిగా డిస్కౌంట్‌ చేసుకోని షేర్లు మరింత పెరగడమే ఇక మిగిలింది. ఫలితంగా ఆయా షేర్ల హెచ్చుతగ్గులకు తగినట్లు కొద్దిరోజులపాటు మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనుకావొచ్చు. అటుతర్వాత సెప్టెంబర్‌ క్వార్టర్లో ఆర్థిక పలితాలే భవిష్యత్‌ మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశించగలవు. మరోవైపు అమెరికా–చైనాల వాణిజ్య చర్చల పురోగతి కూడా ఈక్విటీలపై ప్రభావం చూపించవచ్చు. ఈ వారాంతంలో వడ్డీ రేట్లపై  ఆర్‌బీఐ తీసుకోబోయే నిర్ణయం, అక్టోబర్‌1న వెలువడే ఆటోమొబైల్స్‌ అమ్మకాల డేటా వంటివి మార్కెట్‌ను పరిమితంగా ఊగిసలాటకు లోనుచేయవచ్చు.  ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే... 
 
సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు... 
సెప్టెంబర్‌ 27తో ముగిసిన వారంలో తొలిరోజున 39,441 గరిష్టస్థాయికి చేరిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ అటుతర్వాత మిగిలిన నాలుగురోజులూ పరిమిత శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 808 పాయింట్ల లాభంతో 38,823 వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్లో కన్సాలిడేషన్‌ కొనసాగితే సెన్సెక్స్‌ తొలుత 38,670  వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 38,380 వద్ద గట్టి మద్దతు లభిస్తున్నది ఈ స్థాయిని కూడా వదులుకుంటే క్రమేపీ 38,000 స్థాయి వద్దకు క్షీణించవచ్చు. ఈ వారం రెండో మద్దతుస్థాయిని పరిరక్షించుకున్నా, బలంగా ప్రారంభమైనా 39,160  స్థాయిని చేరవచ్చు. అటుపై క్రమేపీ 39,440 స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే వేగంగా 39,650 వద్దకు చేరవచ్చు.   
 
నిఫ్టీకి 11,380 పాయింట్ల మద్దతు కీలకం... 
క్రితం సోమవారం 11,695 గరిష్టం వరకూ పెరిగిన నిఫ్టీ...మిగతా 4 రోజులూ 1.5% శ్రేణిలో హెచ్చుతగ్గులకులోనై,  చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 238 పాయింట్ల లాభంతో 11,512 వద్ద ముగిసింది. ఈవారం నిఫ్టీ తగ్గితే 11,465 వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని వదులుకుంటే 11,380 వద్ద లభించబోయే మద్దతు నిఫ్టీకి కీలకం. ఈ స్థాయిని సైతం వదులుకుంటే క్రమేపీ 200 రోజుల చలన సగటు రేఖ కదులుతున్న 11,250 సమీపానికి క్షీణించవచ్చు. ఈ వారం రెండో మద్దతును పరిరక్షించుకున్నా, పాజిటివ్‌గా ప్రారంభమైనా నిఫ్టీ తొలుత 11,610 వద్దకు చేరవచ్చు. అటుపైన ముగిస్తే 11,690 వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిని ఛేదిస్తే 11,750  వరకూ ర్యాలీ జరపవచ్చు.  

– పి. సత్యప్రసాద్‌   

మరిన్ని వార్తలు