ఆర్థిక సంవత్సరంలో 25 శాతం ర్యాలీ

1 Apr, 2015 01:08 IST|Sakshi
ఆర్థిక సంవత్సరంలో 25 శాతం ర్యాలీ

  2009-10 తర్వాత ఇదే పెద్ద అప్‌ట్రెండ్
  ఫార్మా షేర్ల జోరు
  పెరిగిన వాహన, బ్యాంకింగ్ షేర్లు
  తగ్గిన మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు
 
 ఈ మార్చి31తో ముగిసిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 25 శాతం వృద్ధి సాధించింది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఇదే అత్యుత్తమ వృద్ధి. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక విదేశీ నిధులు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సర కాలానికి 5,571 పాయింట్లు పెరిగింది. గత ఏడాది మార్చి 31న 22,386గా ఉన్న సెన్సెక్స్ ఈ ఏడాది మార్చి 31 నాటికి 27,957 పాయింట్లకు ఎగసింది. ఇక నిఫ్టీ 1,787 పాయింట్లు(27 శాతం) లాభపడింది. 2014-15లోనేసెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిలను చేరాయి. మార్చి 4న సెన్సెక్స్ 30,025 పాయింట్లను, నిఫ్టీ 9,119 పాయింట్ల(ఇవి రెండూ ఆల్‌టైమ్ హై)ను తాకాయి.
 
 అన్ని రంగాల సూచీల్లో బీఎస్‌ఈ హెల్త్‌కేర్ సూచీ అత్యధికంగా లాభపడింది. ఈ సూచీ 70 శాతం ఎగసింది. 25 ఫార్మా షేర్లలో 12కు పైగా వంద శాతం పెరగడం విశేషం. వాహన, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ సూచీలు 30-44 శాతం రేంజ్‌లో పెరిగాయి. మెటల్ అండ్ ఆయిల్, గ్యాస్ ఇండెక్స్‌లు 3-6 శాతం రేంజ్‌లో పడిపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలను మించి 50 శాతానికి పైగా పెరిగాయి. కాగా గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మార్కెట్లు నుంచి భారత కంపెనీలు రూ.58,801 కోట్లు సమీకరించాయి.  2010-11లో ఇది రూ.72,143 కోట్లు.    2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే  నిధుల సమీకరణకు 2014-15 ఉత్తమ సంవత్సరమని ప్రైమ్ డేటా సంస్థ తెలిపింది.  అయితే 2015 మార్చి నెలలో సెన్సెక్స్ 4.8 శాతం తగ్గింది. 2013 ఫిబ్రవరి నుంచి చూస్తే ఇదే అధ్వాన క్షీణత.
 
 సెషన్‌కు రూ.11,000 కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
 గత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో  ఇన్వెస్టర్ల సంపద రూ.27 లక్షల కోట్లు పెరిగింది. ఒక్కో ట్రేడింగ్ సెషన్ పరంగా చూస్తే రూ.11,000 కోట్లు వృద్ధి చెందింది. విదేశీ నిధులు వెల్లువెత్తడంతో షేర్ల ధరలు దూసుకుపోయాయి. దీంతో కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్, ఇన్వెస్టర్ల సంపద పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో 240 ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.27.34 లక్షల కోట్లు పెరిగి గత నెల 31 నాటికి రూ.101.49 లక్షల కోట్లకు చేరింది. సుస్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం, ద్రవ్యోల్బణం తగ్గుతుండడం వంటి కారణాల వల్ల స్టాక్ మార్కెట్ భారీ వృద్ధి సాధించిందని నిపుణులంటున్నారు.
 

మరిన్ని వార్తలు