ప్రాఫిట్ బుకింగ్ :నష్టాల్లో మార్కెట్లు

20 Mar, 2017 09:51 IST|Sakshi
ముంబై : అంచనావేసిన మాదిరిగానే సోమవారం మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ నెలకొంది. దీంతో గత వారం 2.5 శాతం ర్యాలీ నిర్వహించిన దేశీయ బెంచ్ మార్కు సూచీలు ఒక్కసారిగా కిందకి పడిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్  120 పాయింట్ల నష్టంలో 29,528 వద్ద, నిఫ్టీ 25.20 పాయింట్ల నష్టంతో 9134 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వొడాఫోన్ ఇండియా విలీనానికి ఐడియా సెల్యులార్ ఆమోదం తెలుపడంతో ఐడియా షేర్లు ఒక్కసారిగా 15 శాతం మేర పైకి ఎగిశాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పగ్గాలు అతివాదిగా ముద్రపడిన యోగి ఆదిత్యానాథ్ కు అప్పగించడంతో  ఈ వారంలో మార్కెట్లు ప్రకంపనాలు సృష్టించనున్నాయని విశ్లేషకులు ముందుగానే అంచనావేశారు.
 
అత్యధిక జనాభా ఉన్న యూపీ రాష్ట్ర సీఎంగా యోగి ఎన్నికైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ భవిష్యత్‌ సంస్కరణలపై మార్కెట్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరపవచ్చని, లాభాల స్వీకరణ చోటు చేసుకోవచ్చని మార్కెట్లు విశ్లేషకులు భయాందోళనలు వ్యక్తంచేశారు. వారి భయాందోళనలకు అనుగుణంగా మార్కెట్లు ట్రేడింగ్ ప్రారంభంలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ స్వల్పంగా లాభపడింది. 6 పైసల లాభంతో 65.40 వద్ద ప్రారంభమైంది.  
 
>
మరిన్ని వార్తలు