ఆరు రోజుల ర్యాలీకి బ్రేక్

9 Oct, 2015 01:47 IST|Sakshi

బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు
 క్యూ2 ఫలితాల నేపథ్యంలో
 ముందు జాగ్రత్తలో ఇన్వెస్టర్లు
 190 పాయింట్ల నష్టంతో 26,846కు సెన్సెక్స్
 48 పాయింట్లు నష్టపోయి 8,129కు నిఫ్టీ
 
 ఆరు రోజుల స్టాక్ మార్కెట్ ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం వివరాలు(మినిట్స్) వెల్లడికానున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం,  ప్రైవేట్ బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్, కొ న్ని ఫార్మా షేర్లలో  పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, ప్రస్తుతమున్న ర్యాలీ పరిమిత కాలమేనని ఇన్వెస్టర్లు సందేహిస్తుండడం... ప్రతికూల ప్రభావం చూపాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 190 పాయింట్లు నష్టపోయి 26,846 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 8,129 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే లోహ షేర్లు జోరు కొనసాగింది.
 
 ఇన్వెస్టర్ల ముందు జాగ్రత్త: అందరి అంచనాలను మించి ఆర్‌బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటి(సెప్టెంబర్ 29 గత మంగళవారం) నుంచి స్టాక్ మార్కెట్ లాభాల్లోనే సాగుతోంది. దీనికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు మరింత ఆలశ్యమయ్యే అవకాశాలున్నాయన్న అంచనాలు కూడా తోడవడంతో  స్టాక్ మార్కెట్ గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో జోరుగా పెరుగుతూనే ఉంది. గత ఫెడరల్ రిజర్వ్ సమావేశ మినిట్స్ ద్వారా  రేట్ల కోత ఎప్పుడు ఉండొచ్చనే  సంకేతాల కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నాయి. ఈ నెల 12న ఇన్ఫోసిస్ కంపెనీ జూలై-సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలను వెల్లడించనున్నది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2 ఆర్థిక ఫలితాలు ఆరంభమవుతాయి.
 
 ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కూడా వచ్చే వారం వెలువడనున్నాయి. సెన్సెక్స్ గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో 1,419 పాయింట్లు లాభపడింది. ఈ అంశాలన్నింటి కారణంగా ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారని విశ్లేషకులంటున్నారు. రిలయన్స్ 2.7 శాతం డౌన్: ఓఎన్‌జీసీతో ఉన్న గ్యాస్ వివాదానికి సంబంధించిన దర్యాప్తు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు వ్యతిరేకంగా మారే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.7 శాతం క్షీణించి రూ. 889 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా నష్టపోయిన షేర్ ఇదే. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు నష్టాల్లో ముగిశాయి.  రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు  గెయిల్ 2.5 శాతం, ఐటీసీ 2 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.5 శాతం, సన్ ఫార్మా 1.1 శాత, చొప్పున నష్టపోయాయి. ఇక లాభపడిన షేర్ల విషయానికొస్తే, వేదాంత 2.3 శాతం, టాటా స్టీల్ 1.5 శాతం, హీరో మోటొకార్ప్ 0.8 శాతం, భెల్ 0.5 శాతం, డాక్టర్ రెడ్డీస్ 0.4 శాతం చొప్పున పెరిగాయి.
 

మరిన్ని వార్తలు