మూడో రోజు ముచ్చటైన ర్యాలీ

25 Jan, 2017 15:57 IST|Sakshi
వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల ర్యాలీ నిర్వహించాయి. 332.56 పాయింట్ల ర్యాలీ నిర్వహించిన సెన్సెక్స్ 27,678 వద్ద, 126.95 పాయింట్ల ఎగిసిన నిఫ్టీ 8596 వద్ద క్లోజ్ అయ్యాయి. కంపెనీల క్వార్టర్లీ ఫలితాలు, కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మార్కెట్లు లాభపడుతున్నాయి. కేంద్రం వార్షిక బడ్జెట్లో కేంద్రం ఆర్థికవ్యవస్థకు ఊతంగా కొన్ని రంగాలకు ప్రోత్సహకాలు ప్రకటిస్తుందని పెట్టుబడిదారులు అంచనావేస్తున్నారు. కొన్ని ఫైనాన్సియల్ కంపెనీలు విడుదల చేస్తున్న ఫలితాలతో మార్కెట్లు చాలా ఉత్సాహంగా ఉన్నాయని కొటక్ సెక్యురిటీస్ పబ్లిక్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దిపెన్ షా తెలిపారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఫలితాలపై లేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు జనవరి నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల గడువు కూడా నేటితో ముగిసింది. 
 
 2016 నవంబర్ 10 నుంచి రెండు సూచీలు ఈ మేర గరిష్ట స్థాయిల్లో ట్రేడింగ్ జరుపడం ఇదే తొలిసారి. అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ, హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంకు, కోల్ ఇండియా  మార్కెట్లో లాభాలు పండించగా.. విప్రో, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఎన్టీపీసీలు నష్టాలు గడించాయి. ఎన్ఎస్ఈ ఇండెక్స్లో ఫైనాన్సియల్ స్టాక్స్ మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. క్వార్టర్లీ ఫలితాల నేపథ్యంలో కొటక్ మహింద్రా బ్యాంకు లిమిటెడ్, ఐడీఎఫ్సీ బ్యాంకు లిమిటెడ్, ఇండియన్ బ్యాంకు లిమిటెడ్లు కూడా లాభాలు పండించాయి.  నాలుగేళ్లలో మొదటిసారి అతి తక్కువ లాభాలను ఆర్జించినట్టు ప్రకటించడంతో భారతీ ఎయిర్టెల్ 1.33  శాతం పడిపోయింది. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.01 పైసలు బలపడి 68.13గా ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 193 రూపాయల నష్టంతో 28,532 వద్ద నమోదైంది. గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్లు సెలవును పాటించనున్నాయి.
 
మరిన్ని వార్తలు