వెలుగులో పవర్, ఫార్మా షేర్లు

27 Aug, 2013 03:15 IST|Sakshi
వెలుగులో పవర్, ఫార్మా షేర్లు

 పవర్, ఫార్మా, మెటల్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో వరుసగా మూడోరోజు స్టాక్ సూచీలు పెరిగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ సోమవారం ట్రేడింగ్ తొలిదశలో 208 పాయింట్లు పెరిగి 18,728 పాయింట్ల గరిష్టస్థాయికి చేరింది. అయితే బ్యాంకింగ్, ఆయిల్ షేర్లలో అమ్మకాల కారణంగా తొలి లాభాలను కోల్పోయిన సెన్సెక్స్ చివరకు 39 పాయింట్ల లాభంతో 18,558 పాయింట్ల వద్ద ముగిసింది. తొలుత 5,528 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 5 పాయింట్ల స్వల్పలాభంతో 5,476 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
 
  షార్ట్ రోలోవర్స్ యాక్టివిటీ....
 నిఫ్టీ ఆగస్టు కాంట్రాక్టులో షార్ట్ పొజిషన్ల స్క్వేర్‌ఆఫ్ చేయడం, ఆ పొజిషన్లను వచ్చే నెలకు రోలోవర్ చేసుకోవడంలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నిమగ్నమైనట్లు డెరివేటివ్ డేటా సూచిస్తోంది. మరో మూడురోజుల్లో ఆగస్టు ఫ్యూచర్ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో ఈ నెల నిఫ్టీ ఫ్యూచర్లో షార్ట్ పొజిషన్ల స్క్వేరింగ్ ఆఫ్ యాక్టివిటీ జరగడంతో ఆ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 19.12 లక్షల షేర్లు కట్ అయ్యాయి. దాంతో మొత్తం ఓఐ 2.13 కోట్ల షేర్లకు దిగింది.
 
 సెప్టెంబర్ డెరివేటివ్ సెటిల్‌మెంట్ ప్రారంభంకాబోయే శుక్రవారంనాడు జీడీపీ గణాంకాలు వెలువడనుండటం, రూపాయి మారకపు విలువ తిరిగి 64.30 స్థాయికి తగ్గడం వంటి అంశాల కారణంగా ఇన్వెస్టర్లు షార్ట్ పొజిషన్లను వచ్చే నెల ఫ్యూచర్లోకి రోలోవర్ చేసివుండవచ్చు. షార్ట్ రోలోవర్స్‌ను ప్రతిబింబిస్తూ సెప్టెంబర్ నిఫ్టీ కాంట్రాక్టు ప్రీమియం 10 పాయింట్లకే పరిమితంకావడంతో పాటు ఓఐలో 24.96 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. గతంలో విక్రయించిన ఈ నెల ఫ్యూచర్ కాంట్రాక్టును తిరిగి కొనుగోలు చేయడాన్ని షార్ట్ స్క్వేర్‌ఆఫ్‌గా, వచ్చే నెలకు సంబంధించిన అదే కాంట్రాక్టును మళ్లీ విక్రయించడాన్ని షార్ట్ రోలోవర్‌గా పరిగణిస్తారు.
 
  ఇక స్టాక్ ఫ్యూచర్లలో 9 శాతం ర్యాలీ జరిపిన సేసా గోవా కాంట్రాక్టులో అసాధారణమైన ట్రేడింగ్ జరిగింది. సేసా గోవాలో విలీనం కానున్న స్టెరిలైట్ ఇండస్ట్రీస్ షేరుకు సోమవారం చివరి ట్రేడింగ్‌రోజు కావడంతో ఈ రెండు షేర్లకు సంబంధించిన ఫ్యూచర్ కాంట్రాక్టుల యాక్టివిటీ అంతా సేసా గోవాలోనే జరిగింది. ఫలితంగా ఆగస్టు సేసా గోవా ఫ్యూచర్లో 3.28 లక్షల షేర్లు యాడ్‌కాగా, మొత్తం ఓఐ 87.78 లక్షల షేర్లకు పెరిగింది.
 
 షార్ట్ సెల్లింగ్‌ను సూచిస్తూ ఆగస్టు కాంట్రాక్టు క్యాష్ ధరతో పోలిస్తే రూ. 8 డిస్కౌంట్‌తో ముగిసింది. సెప్టెంబర్ ఫ్యూచర్లో భారీగా 76.72 లక్షల షేర్ల మేర షార్ట్స్ రోలోవర్ అయ్యాయి. దాంతో ఆ నెల ఫ్యూచర్లో ఓఐ 1.75 కోట్ల షేర్లకు పెరిగింది. ఇది సేసా గోవా కౌంటర్లో రికార్డు.  కొద్ది రోజుల నుంచి క్యాష్ మార్కెట్లో షేర్లను కొంటున్న  ఇన్వెస్టర్లు, ఆ షేర్లను హెడ్జ్ చేసుకునే ప్రక్రియలో ఫ్యూచర్ కాంట్రాక్టును షార్ట్ చేస్తున్నట్లు ఈ డేటా సూచిస్తోంది.
 

మరిన్ని వార్తలు