'సెప్టెంబర్ 17' విమోచనమా? విలీనమా?

17 Sep, 2016 07:13 IST|Sakshi
'సెప్టెంబర్ 17' విమోచనమా? విలీనమా?

హైదరాబాద్: 'నిజాం సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ లో కలిసిపోవడం గొప్ప పరిణామమే. అయితే 17 తర్వాతి రోజుల్లో అమాయక ముస్లింలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఇప్పుడు మనం సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరుపుకొంటే కొందరిని బాధపెట్టినవాళ్లమవుతాం. అసలు జరుపుకోకుండా ఉంటే చరిత్రను మరిచిపోయినట్లే లెక్క. అందుకే సెప్టెంబర్ 17ను విలీన దినంగా పాటించాలని కోరుకుంటున్నాం' అని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అన్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరామ్ ఈ మేరకు జేఏసీ అభిప్రాయన్ని వ్యక్తపరిచారు.

కాగా, బీజేపీకి చెందిన వక్తలు మాత్రం.. నిజాం పాలనకు ఫుల్ స్టాప్ పడిన సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విమోచన దినమే అని వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్ విలీన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా కేంద్ర మంత్రి దత్తాత్రేయ చొరవతీసుకోవాలని కోరారు. అయితే ఈ విషయంలో జేఏసీ ఉద్యమాన్ని చేపట్టబోదని స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జస్టిస్ నర్సింహారెడ్డి, సినీకవి సుద్దాల అశోక్ తేజ, పలువురు సామాజికవేత్తలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.

మరిన్ని వార్తలు