షాకింగ్: ఢిల్లీలో సీరియల్ రేపిస్టు అరెస్టు

16 Jan, 2017 08:25 IST|Sakshi
షాకింగ్: ఢిల్లీలో సీరియల్ రేపిస్టు అరెస్టు
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో షాకింగ్ విషయం బయటపడింది. ఇద్దరు బాలికలపై అఘాయిత్యం చేయబోయిన 38 ఏళ్ల సునీల్ రస్తోగీ అనే టైలర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. విచారణ సందర్భంగా మరో దారుణమైన సంచలన విషయం బయటపడింది. గత 12 ఏళ్లలో తాను దాదాపు 500 మంది పిల్లలపై అఘాయిత్యం చేసినట్లు రస్తోగీ తెలిపాడు. ఇదే నేరానికి గాను ఇంతకుముందు 2006 సంవత్సరంలో ఆరు నెలలు జైల్లో కూడా ఉన్నాడు. 
 
ప్రధానంగా ఢిల్లీ, పశ్చిమ యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఇంటి నుంచి స్కూళ్లకు నడుచుకుంటూ వెళ్లే బాలికలను ఇతడు లక్ష్యంగా చేసుకునేవాడని పోలీసులు చెప్పారు. కొంతకాలం పాటు తూర్పు ఢిల్లీలో ఓ టైలరింగ్ దుకాణంలో పనిచేశాడు. తరచు అటూ ఇటూ వెళ్తూ ఉండేవాడు. ప్రస్తుతానికి ఆధారాలు దొరికిన ఆరు కేసుల్లో మాత్రం రస్తోగీని బుక్ చేశారు. వాటిలో మూడు ఢిల్లీ, రెండు రుద్రాపూర్ మరొకటి బిలాస్‌పూర్ జిల్లాలోనివి. 2004 సంవత్సరంలో మయూర్ విహార్ ప్రాంతంలో ఉండేటప్పుడు పొరుగింట్లో ఉండే ఒక అమ్మాయిపై అఘాయిత్యం చేయబోగా.. చుట్టుపక్కల వాళ్లు చితక్కొట్టి అక్కడినుంచి తరిమేశారు. 
 
గత సంవత్సరం డిసెంబర్ 13వ తేదీన పదేళ్ల బాలిక స్కూలు నుంచి తిరిగొస్తుండగా అత్యాచారానికి గురి కావడంతో ఇతడి పాపం పండింది. ఆమె ప్రవర్తన తేడాగా ఉండటంతో ఆమెను అడగ్గా, చివరకు విషయం తెలిసింది. బాలిక చెప్పిన వివరాలను, పోలికలను బట్టి నిందితుడి కోసం పోలీసులు గాలించడం మొదలుపెట్టారు. ఇంతలో జనవరి 12వ తేదీన న్యూ అశోక్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మరో ఇద్దరు బాలికలు అపహరణకు గురయ్యారని ఫిర్యాదు నమోదైంది. కొత్త బట్టలు కొనిస్తానని చెప్పి రస్తోగీ వాళ్లను తీసుకెళ్లాడు. నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు వెళ్లి అక్కడ అత్యాచారం చేయబోగా పిల్లలు అరవడంతో అక్కడినుంచి పారిపోయాడు. అతడిని కోండ్లి గ్రామంలో పోలీసులు అరెస్టు చేశారు. తాను 2004 నుంచి ఈ తరహా నేరాలు చేస్తున్నట్లు విచారణలో రస్తోగీ వెల్లడించడంతో అంతా నిర్ఘాంతపోయారు.
మరిన్ని వార్తలు