కొన్ని చౌక.. మరికొన్ని ప్రియం

1 Apr, 2015 00:19 IST|Sakshi
కొన్ని చౌక.. మరికొన్ని ప్రియం

 నేటి నుంచి అమల్లోకి సేవా పన్ను ప్రతిపాదనలు
 న్యూఢిల్లీ: బడ్జెట్‌లో పేర్కొన్న కొన్ని సేవా పన్ను ప్రతిపాదనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుండటంతో మ్యూజియాల, జంతు ప్రదర్శన శాలల, జాతీయ పార్కుల, జంతు సంరక్షణ శాలల ప్రవేశ టికెట్ల ధరలు తగ్గనున్నాయి. వీటి కి సేవా పన్ను మినహాయింపు ఇచ్చారు. వీటితోపాటు వరిష్ట పెన్షన్ బీమా యోజన, అంబులెన్స్ సర్వీసులు, కూరగాయల, పండ్ల రిటైల్ ప్యాకింగ్ వంటి వాటిపైన కూడా సేవా పన్ను విధించలేదు. బిజినెస్ క్లాస్ విమాన టికెట్ల ధరలు మాత్రం పెరగనున్నాయి. వీటిపై ప్రస్తుతం ఉన్న 40 శాతం సేవా పన్ను నేటి నుంచి 60 శాతానికి పెరుగుతుంది.
 
 సేవాపన్ను కిందకు మ్యూచువల్,చిట్ ఫండ్స్ సేవలు
 ఇకపై మ్యూచువల్ ఫండ్స్ సేవలు, లాటరీ టికెట్ల మార్కెటింగ్, డిపార్ట్‌మెంట్ల పబ్లిక్ టెలిఫోన్లు, ఎయిర్‌పోర్ట్స్, హాస్పిటల్స్ ఉచిత టెలిఫోన్ కాల్స్ సేవా పన్ను కిందకు రానున్నాయి. చిట్ ఫండ్స్‌కు సంబంధించిన లావాదేవీలకూ సేవా పన్ను వర్తించనుంది. ప్రభుత్వానికి సంబంధించిన చారిత్రక కట్టడాల, నీటిపారుదల పనులు, తాగు నీటి సరఫరా, మురికి నీటి శుద్ధి నిర్వహణ వంటి వివిధ నిర్మాణాత్మక సేవలకు ఏప్రిల్ 1 నుంచి సేవా పన్ను మినహాయింపు ఉంటుంది. జానపద, శాస్త్రీయ కళాకారులు అందించే సేవల విలువ రూ. లక్షకు తక్కువగా ఉంటే వాటికి పన్ను మినహాయింపు వర్తిస్తుంది. రైలు, రోడ్డు మార్గాలలో రవాణా చేసే ఆహార పదార్థాలకు (బియ్యం, పప్పు ధాన్యాలు, పాలు, ఉప్పు మాత్రమే) పన్ను మినహాయింపు ఉంటుంది. ఇతర పదార్థాల ధరలు పెరగనున్నాయి. ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాలకు అందించే నిర్మాణ సర్వీసులకు కల్పిస్తున్న పన్ను మినహాయింపులు ఇకపై ఉండవు.
 

మరిన్ని వార్తలు