సీఎంపై సీనియర్‌ నటి మండిపాటు!

23 Oct, 2016 17:55 IST|Sakshi
సీఎంపై సీనియర్‌ నటి మండిపాటు!

'యే దిల్‌ హై ముష్కిల్‌' (ఏడీహెచ్‌ఎం) సినిమా విడుదల విషయంలో ఎమ్మెన్నెస్‌ అధినేత రాజ్‌ ఠాక్రే, చిత్ర దర్శకుడు కరణ్‌ జోహార్‌ మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీ కుదిర్చిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ నటించినందుకు ఈ సినిమాపై ఎమ్మెన్నెస్‌ నిషేధం విధించింది. సీఎం సమక్షంలో జరిగిన చర్చల నేపథ్యంలో ఏడీహెచ్‌ఎంపై నిషేధం ఎత్తివేసేందుకు రాజ్‌ ఠాక్రే అంగీకరించారు. అంతేకాకుండా భవిష్యత్తులో పాక్‌ నటులతో సినిమాలు తీయవద్దని, అలా సినిమాలు తీస్తే రూ. ఐదు కోట్లు భారత ఆర్మీ జవాన్ల సంక్షేమ నిధికి ఇవ్వాలని రాజ్‌ ఠాక్రే షరతులు పెట్టారు.


అయితే, ఈ విషయంలో సీఎం స్థాయి వ్యక్తి రాజీయత్నాలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం ఫడ్నవిస్‌ తీరును బాలీవుడ్‌ సీనియర్‌ నటి షబానా ఆజ్మీ తీవ్రంగా తప్పుబట్టారు. 'ఎంత దారుణమైన పరిస్థితి ఇది! సీఎం బ్రోకరిజం చేసి రూ. 5 కోట్లకు దేశభక్తిని కొనుగోలు చేశారు. ఏడీహెచ్‌ఎం శాంతియుతంగా విడుదల అయ్యేలా చూస్తామని ఏకంగా కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చాక కూడా ఇలా జరిగింది’ అని షబానా వరుస ట్వీట్లలో మండిపడ్డారు. ’నేను దేశభక్తురాలినా? కాదా? అన్నది ఎమ్మెన్నెస్‌ నిర్ణయిస్తుందా? నేను రాజ్యాంగానికి బద్ధురాలిని కానీ, రాజ్‌ ఠాక్రేకు కాదు. నిజానికి ఆయన దేశభక్తిని ప్రశ్నించాల్సిన అవసరముంది’ అని పేర్కొన్నారు. 'యే దిల్‌ హై ముష్కిల్’  విడుదలకు కేంద్రహోంమంత్రి హామీ ఇచ్చినా ఆయనపై సీఎం ఫడ్నవిస్‌ ఏమాత్రం గౌరవం చూపలేదని, ఆయన నుంచి బీజేపీ వివరణ అడగాలని ఆమె డిమాండ్‌ చేశారు.
 

>
మరిన్ని వార్తలు