ఆపద్ధర్మ ప్రధానిగా పెట్రోలియం మంత్రి

30 Jul, 2017 07:22 IST|Sakshi
ఆపద్ధర్మ ప్రధానిగా పెట్రోలియం మంత్రి

తెరపైకి షాహిద్‌ అబ్బాసీ.. షరీఫ్‌ తమ్ముడికే పూర్తికాలపు ప్రధాని పదవి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా పెట్రోలియం, సహజ వనరులశాఖ మంత్రి షాహిద్‌ ఖాకన్‌ అబ్బాసి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అధికార పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) పార్టీ శనివారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ శనివారం పార్టీ నేతలతో జరిపిన సమావేశంలో అబ్బాసీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

పనామా పత్రాల్లో తన కుటుంబసభ్యుల పేర్లు ఉండటంతో నవాజ్‌ షరీఫ్‌పై చట్టసభ సభ్యుడిగా పాక్‌ సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పాక్‌ తాత్కాలిక ప్రధానిగా అబ్బాసి 45 రోజులు సేవలు అందించనున్నారని, ఈ లోపు పార్లమెంటుకు పోటీచేసి.. నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు, పంజాబ్‌ సీఎం షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్ధమవుతారని అధికార పీఎంఎల్‌ఎన్‌ వర్గాలు తెలిపాయి. నవాజ్‌పై అనర్హత వేటు నేపథ్యంలో ఆయన వారసుడిగా సోదరుడు షెహ్‌బాజ్‌ ఎన్నికకు పీఎంఎల్‌ఎన్‌ మెజారిటీ నేతలు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. షరీఫ్‌ సంతానానికి విదేశాల్లో అక్రమ కంపెనీలు ఉన్నాయని 2015లో వెలుగుచూసిన పనామా పత్రాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన జిట్‌ నివేదిక మేరకు.. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నవాజ్‌పై అనర్హత వేటువేస్తూ ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది.

>
మరిన్ని వార్తలు