శశిథరూర్‌కు గుండెదడ

19 Jan, 2014 01:57 IST|Sakshi
శశిథరూర్‌కు గుండెదడ

ఎయిమ్స్‌లో వైద్యపరీక్షల తర్వాత డిశ్చార్జ్

కేంద్రమంత్రి శశిథరూర్.. తన భార్య సునంద అనుమానాస్పద స్థితిలో మరణించిన కొన్ని గంటలకు శనివారం తెల్లవారుజామున గుండెదడ, ఛాతీనొప్పితో బాధపడుతూ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. హ–{దోగ నిపుణుల బృందం పలు వైద్య పరీక్షలు నిర్వహించి కొన్ని గంటలపాటు పరిశీలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని నిర్ధారించి మధ్యాహ్నానికి డిశ్చార్జ్ చేశారు. శశిథరూర్ (57) తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో.. అసౌకర్యం, గుండెదడతో ఆస్పత్రిలో చేరినట్లు ఎయిమ్స్ అధికార ప్రతినిధి నీరజాబాట్లా మీడియాకు తెలిపారు. ‘‘ఆయనకు డయాబెటిస్ (సుగర్), అధిక రక్తపోటు ఉన్నట్లు ఇటీవల గుర్తించటం జరిగింది. ఆయనను వైద్య పరిశీలనలో ఉంచి.. కార్డియాలజిస్ట్‌ల బృందం పరీక్షించింది. ఈసీజీ, ఇతర పరీక్షలు నిర్వహించగా.. అంతా సవ్యంగానే ఉంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది’’ అని ఆమె వివరించారు. శనివారం మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జ్ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు ఆ తర్వాత వెల్లడించాయి.

రేపు థరూర్ వాంగ్మూలం నమోదు

న్యూఢిల్లీ: సునంద అనుమానాస్పద మరణంపై దర్యాప్తు చేపట్టిన సబ్‌డివిజినల్ మెజిస్ట్రేట్ అలోక్‌శర్మ.. సునంద కుమారుడు శివ్‌మీనన్‌తో పాటు, ఆమె సోదరుడి నుంచి వాంగ్మూలాలు నమోదు చేసినట్లు శనివారం రాత్రి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. అలాగే.. శశిథరూర్ నివాసంలో పనిచేసే ఇద్దరు పనిమనుషుల వాంగ్మూలం కూడా తీసుకున్నట్లు చెప్పారు. సునంద భర్త శశిథరూర్, కుటుంబ సభ్యులు ఆదివారం హరిద్వార్‌కు వెళుతున్నట్లు సమాచారం ఇచ్చారని.. కాబట్టి ఆయన వాంగ్మూలాన్ని సోమవారం నమోదు చేస్తామని అలోక్‌శర్మ తెలిపారు. ఎవరైనా మహిళ వివాహమైన ఏడేళ్ల లోపు మరణించిన పక్షంలో.. ఆమె మరణానికి ఏదైనా కుట్ర కారణమా అనేది దర్యాప్తు చేయాలన్న నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ 176 కింద తాను దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

హోటల్ లాబీలో భార్యాభర్తల వాగ్వాదం: పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. వీరు చెప్పిన విషయాలను శశిథరూర్ సిబ్బంది చెప్పిన అంశాలకు సరిపోతున్నాయా లేదా అనే కోణంలో విశ్లేషిస్తున్నారు. థరూర్, సునందలు గురువారం హోటల్ సూట్‌లో దిగేముందు వేర్వేరుగా రెండు గదులు రిజర్వు చేసుకున్నారని.. కానీ తర్వాత ఒకే సూట్‌లోకి మారారని వినిపిస్తోంది. భార్యాభర్తలిద్దరి మధ్య హోటల్ లాబీలో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు హోటల్ సిబ్బంది పోలీసులకు తెలిపినట్లు సమాచారం. సునంద మరణించిన హోటల్ సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరీక్షించారు. సునంద ఫోన్‌కాల్స్ వివరాల్ని, కొద్ది రోజులుగా ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా ఏదైనా వ్యాధికి చికిత్సలో భాగంగా తీసుకునే మందుల మోతా దు ఎక్కువవటం మరణానికి కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు