నిన్న వివాదం.. నేడు విషాదం

18 Jan, 2014 02:32 IST|Sakshi
భర్త శశి థరూర్తో సునంద పుష్కర్(ఫైల్)

* కేంద్రమంత్రి శశి థరూర్ భార్య ఢిల్లీ హోటల్ గదిలో అనుమానాస్పద మృతి
* తన భర్త శశిథరూర్‌కు పాక్ జర్నలిస్టుతో వివాహేతర సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసిన రెండు రోజులకే అనూహ్య మృతి
* మరణానికి కారణం ఇప్పుడే చెప్పలేమన్న పోలీసులు.. ఆత్మహత్యగా అనుమానం
 
న్యూఢిల్లీ:  కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునందపుష్కర్ శుక్రవారం రాత్రి ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తన భర్త శశిథరూర్‌కు పాకిస్థాన్‌కు చెందిన మెహర్‌తరార్ అనే మహిళా జర్నలిస్టుతో వివాహేతర సంబంధం ఉందంటూ ఇటీవల సామాజిక వెబ్‌సైట్ ట్విటర్‌లో సునందపుష్కర్ ఆరోపణలు చేయటం.. దీనికి సదరు పాక్ జర్నలిస్టు ఘాటుగా సమాధానం ఇవ్వటం వంటి పరిణామాల నేపథ్యంలో సునంద అకస్మాత్తుగా చనిపోయి కనిపించటం దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది.

పాక్ జర్నలిస్టు విషయమై వివాదానికి సంబంధించి.. తమ మధ్య ఎలాంటి విభేదాలూ లేవని సునంద, శశిథరూర్‌లు గురువారం నాడు మీడియాకు ప్రకటన జారీచేశారు. కానీ శుక్రవారం రాత్రికి సునంద(52) విగతజీవిగా మారారు. తన భార్య మృతికి సంబంధించి కేంద్రమంత్రి శశిథరూర్ నుంచే పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే.. సునంద ఆత్మహత్య చేసుకుని ఉంటారని తాము భావిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి రంజన్‌భగత్ వెల్లడించిన వివరాలివీ...


* శశిథరూర్ వ్యక్తిగత కార్యదర్శి అభినవ్‌కుమార్ శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌చేశారు. ఆ వెంటనే సరోజినీనగర్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు సిబ్బంది హుటాహుటిన దక్షిణ ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లారు.

* కేంద్రమంత్రి శశిథరూర్, సునందపుష్కర్‌ల నివాసంలో పెయింటింగ్ పని జరుగుతున్నందున.. వారిద్దరూ గురువారం నుంచి హోటల్‌లోని ఒక సూట్‌లో బసచేశారు.

* శశిథరూర్ శుక్రవారం రోజంతా ఏఐసీసీ సమావేశంలో పాల్గొన్నందువల్ల.. హోటల్ సూట్‌లో లేరు.
* ఆయన రాత్రి 8:30 గంటలకు హోటల్‌కు తిరిగి రాగా.. తాము బసచేసి ఉన్న సూట్‌లో సునంద గది లోపలి నుంచి గడియపెట్టి ఉండటం గుర్తించారు.

* సునంద మామూలుగా నిద్రపోతున్నట్లు కనిపించారు. కానీ ఆ తర్వాత ఆమె చనిపోయినట్లు గుర్తించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరిగిన ఆనవాళ్లు లేవు. కానీ.. ఇది సహజ మరణమా? కాదా? మరణానికి కారణమేమిటి? ఎప్పుడు చనిపోయారు? అనేది ఇప్పుడే చెప్పలేం.

* హోటల్ సూట్ నంబర్ 345కు పోలీసులు వెళ్లి, స్వాధీనంలోకి తీసుకున్నపుడు కేంద్రమంత్రి శశిథరూర్ అక్కడే ఉన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించటానికి ఫోరెన్సిక్ నిపుణులు కూడా వచ్చారు.
* సునంద మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్‌కి తరలించారు.

* వివాహమైన ఏడేళ్లలోపు ఎలాంటి మరణం సంభవించినా చట్ట ప్రకారం ఆ ప్రాంత సబ్-డివిజినల్ మేజిస్ట్రేట్ దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుందని.. ఆమేరకు దర్యాప్తు ప్రారంభమైంది.
 
ప్రధాని సంతాపం
శుక్రవారం రాత్రి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ శశిథరూర్‌తో మాట్లాడి.. సునంద మృతిపట్ల తీవ్ర విచారం, ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు.
 
ఏమిటీ వివాదం..?
శశిథరూర్ - సునందపుష్కర్ - మెహర్‌తరార్ - ఈ ముగ్గురి మధ్య అంతర్గతంగా నడుస్తున్న వివాదం బుధవారం ఒక్కసారిగా భగ్గుమంది. శశిథరూర్‌కు చెందిన ట్విటర్ ఖాతాలో.. మెహర్‌తరార్ పంపించినట్లు చెప్తున్న అసంబద్ధమైన వ్యక్తిగత సందేశాలు ప్రచురించటం మొదలవటంతో వివాదం రచ్చకెక్కింది. ఆ తర్వాత సునంద తన ట్విటర్ ఖాతాలో కొన్ని వ్యాఖ్యలు చేశారు.

తన భర్త శశిథరూర్‌కు మెహర్‌తరార్ పంపిన ప్రయివేటు సందేశాలను తాను ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నానని.. మెహర్ ఎలా తన భర్త వెంట పడుతోందీ తెలియజేయటానికే ఈ పని చేశానని పేర్కొన్నారు. సునంద ఆ తర్వాత ఒక వార్తా పత్రికతో మాట్లాడుతూ.. మెహర్‌తరార్ ఒక ఐఎస్‌ఐ ఏజెంట్ అని, ఆమె తన భర్త వెంటపడుతున్నారని ఆరోపించారు. తమ వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేయటానికి మెహర్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

అయితే.. థరూర్ మాత్రం తన ట్విటర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి ఈ వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ.. థరూర్ ట్విటర్ ఖాతాలో తానే ఆ వ్యాఖ్యలు పోస్ట్ చేశానని సునంద పేర్కొన్నారు. గురువారం నాడు.. శశిథరూర్, సునందలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తమ వ్యక్తిగత అంశాలకు వక్రభాష్యాలు చెప్పటం ద్వారా అనవసర వివాదాన్ని రేకెత్తిస్తున్నారని, తమ మధ్య ఎలాంటి విభేదాలూ లేవని పేర్కొన్నారు.
 

పాకిస్థానీ జర్నలిస్టు మెహర్
 మెహర్‌తరార్ ‘డైలీ టైమ్స్ ఆఫ్ పాకిస్థాన్’ పత్రికలో ప్రముఖ జర్నలిస్టు. ఆ పత్రికలో గత మూడేళ్లుగా పనిచేస్తున్నారు. ఆ పత్రికలో రాసే కాలమ్స్ ద్వారా ఆ పేరుగాంచారు. పాక్ వ్యాప్తంగా ఖ్యాతిగడించారు. అయితే ప్రపంచానికి ఆమె గురించి తెలీదు. శశిథరూర్ వివాదంతో ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారారు. సునందపుష్కర్ ఆరోపించినట్లు శశిథరూర్‌కు, తనకు మధ్య ఎలాంటి సంబంధమూ లేదంటూ మెహర్ తిరస్కరించారు. ఇదంతా సునంద కల్పనేనని కొట్టివేశారు. ఆమె గురువారం ఒక పత్రికకు ఫోన్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘‘గత ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీలో శశిథరూర్‌ను ఇంటర్వ్యూ చేయటం కోసం తొలిసారి కలిశాను. మొదట ఆయన ఆఫీసులో కలిశాం. ఆ తర్వాత ఒక కళా ప్రదర్శనకు ఆయన వెళుతుంటే.. ఆ ప్రదర్శనలో చాలా మంది పాకిస్థానీ కళాకారులు ఉన్నందున, నేను కూడా పాకిస్థానీ మహిళనే అయినందున ఆయనతో కలిసి వెళ్లాను. ఆ ప్రదర్శన అనంతరం మేం ఒక పబ్లిషర్ ఇంట్లో పార్టీకి వెళ్లాం. అక్కడ చాలా మందిని నేను కలిశాను. మళ్లీ జూన్‌లో దుబాయ్‌లో మరోసారి శశిథరూర్‌ను కలిశా. అది ఒక కార్యక్రమంలో. ఆ తర్వాత ఆయనను నేను కలవలేదు. భారతదేశంలో ఎన్నికల మీద నేను ఒక పుస్తకం రాయాలనుకున్నాను. నాకు తెలిసిన భారతీయ రాజకీయ నాయకుడు శశిథరూర్ ఒక్కరే. ఆయన కేరళకు చెందిన వారు కావటంతో కేరళ గురించి పుస్తకం రాద్దామని నేను అనుకున్నా.

గత డిసెంబర్‌లో జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్‌అబ్దుల్లాను ఇంటర్వ్యూ చేసేందుకు మళ్లీ ఢిల్లీ వచ్చాను. అప్పుడు శశిథరూర్‌కు ఫోన్ చేస్తే ఆయన నగరంలో ఉండటం లేదని చెప్పారు. నేను ఢిల్లీ వచ్చినా ఆయనను కలవలేదు. ఈ సాక్ష్యం సరిపోదా?’’ అని చెప్పారు. తనను ఐఎస్‌ఐ ఏజెంట్‌గా ఆరోపించినందుకు సునందపై కేసు పెట్టగలనని వ్యాఖ్యానించారు. తాను లాహోర్‌లో నివసిస్తున్నందు వల్ల ఆ కేసు కొనసాగించటం సాధ్యం కాదు కాబట్టి ఆ పనిచేయటం లేదన్నారు. తన సోదరుడు దౌత్యవేత్త అని.. తనపై చేసిన విమర్శలు తన సోదరుడికి ఇబ్బందికర పరిస్థితిని తెస్తున్నాయని చెప్పారు.

మరిన్ని వార్తలు