కేరళ గవర్నర్గా షీలా దీక్షిత్ ప్రమాణం

11 Mar, 2014 16:57 IST|Sakshi
కేరళ గవర్నర్గా షీలా దీక్షిత్ ప్రమాణం

తిరువనంతపురం : కేరళ గవర్నర్గా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మంజులా చెల్లార్ ... షీలాతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ, పలువురు మంత్రులు, స్పీకర్ జి. కార్తికేయన్ తదితరులు పాల్గొన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీ నేతలు మాత్రం ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు అయ్యారు. షీలా దీక్షిత్  ఈ సందర్భంగా కేరళ సంప్రదాయ దుస్తుల్లో విచ్చేశారు.

కాగా షీలా దీక్షిత్‌పై ప్రముఖ మలయాళ నటి రీమా కళింగళ్ సెటైర్ వేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కేరళ గవర్నర్‌గా బాధ్యతల్ని చేపట్టనున్న షీలాదీక్షిత్‌పై తన ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేసి కలకలం పుట్టించారు. ఆ మధ్య ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది.
 
 ఆ సంఘటనపై షీలాదీక్షిత్ మాట్లాడుతూ స్త్రీలు రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగకుండా రాత్రి ఏడు గంటల్లోపు ఇల్లు చేరుకోవాలని అన్నారు. షీలాదీక్షిత్ మంగళవారం కేరళ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి రీమా కళింగళ్ తన ఫేస్‌బుక్‌లో షీలా దీక్షిత్ మన రాష్ట్రానికి గవర్నర్‌గా రానున్నారు కాబట్టి ఇకపై కేరళ స్త్రీలందరూ రాత్రి 7 గంటల్లోపే ఇంటికి చేరుకోండి అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కేరళ రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే రేపాయి.

ఇక  షీలా దీక్షిత్ మూడుసార్లు ఢిల్లీ సీఎంగా 1998 నుంచి 2013 వరకు ఉన్నారు.అదేవిధంగా 1984-89 మధ్య ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గత డిసెంబర్‌లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌పై ఘోరపరాజయం పాలైన మూడు నెలల వ్యవధిలోనే దీక్షిత్ గవర్నర్‌గా నియమితులు కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు