షెల్ చేతికి బీజీ గ్రూప్

9 Apr, 2015 00:57 IST|Sakshi

70 బిలియన్ డాలర్ల డీల్
లండన్: దిగ్గజ సంస్థ రాయల్ డచ్ షెల్ తాజాగా చమురు, గ్యాస్ రంగంలో భారీ డీల్‌కు తెరతీసింది. బ్రిటన్‌కు చెందిన పోటీ సంస్థ బీజీ గ్రూప్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ 70 బిలియన్ డాలర్లు (సుమారు రూ.4.2 లక్షల కోట్లు). ఈ డీల్ ద్వారా ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి చేసే స్వతంత్ర సంస్థల్లో అతి పెద్ద కంపెనీగా రాయల్ డచ్ షెల్ ఎదగనుంది. అగ్రస్థానంలో ఉన్న అమెరికన్ కంపెనీ ఎక్సాన్ మొబిల్ తర్వాత రెండో స్థానానికి చేరనుంది. ఒప్పందం ప్రకారం మంగళవారం నాటి బీజీ షేరు క్లోజింగ్ ధర 910.4 పెన్స్‌పై 50 శాతం ప్రీమియంను షెల్ చెల్లించాల్సి ఉంటుంది.

 విలీనానంతరం ఏర్పడే కంపెనీలో బీజీ షేర్‌హోల్డర్లకు 19 శాతం వాటాలు దక్కుతాయి. 2016 తొలినాళ్లకి డీల్ పూర్తి కాగలదని షెల్ సీఈవో బెన్ వాన్ బ్యూర్డెన్ తెలిపారు.  ముడి చమురు రేట్లకు ప్రామాణికమైన బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 60 డాలర్ల దిగువకి పడిపోయిన తరుణంలో తాజా ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. 1998లో చమురు సంక్షోభం ఏర్పడి క్రూడ్ రేటు బ్యారెల్‌కు 12 డాలర్లకు పడ్డపుడు అమొకో సంస్థను బీపీ ... మొబిల్ కార్పొరేషన్‌ను ఎక్సాన్... టెక్సాకోను షెవ్రాన్, పెట్రోఫినాను టోటల్ ఎస్‌ఏ కొనుగోలు చేశాయి.

దశాబ్ద కాలంలో తొలి భారీ డీల్: చమురు, గ్యాస్ రంగానికి సంబంధించి గడచిన రెండు దశాబ్దాల్లో ఇది అత్యంత భారీ డీల్. అలాగే వివిధ రంగాలవారీగా చూస్తే గత పదేళ్లలో ఇంత పెద్ద స్థాయి కొనుగోలు ఇదే ప్రథమం. 2000లో గ్లాక్సో వెల్‌కమ్ కంపెనీ బ్రిటన్ కి చెందిన స్మిత్‌కై్లన్ బీచామ్‌ను 44.4 బిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసిన తర్వాత .. దాన్ని మించే డీల్  ఇదే. అయితే, 1999లో మానెస్‌మన్ ఏజీని కొనుగోలు చేసేందుకు వొడాఫోన్ ఎయిర్‌టచ్ 202.8 బిలియన్ డాలర్లు వెచ్చించిన ఒప్పందం యూరప్‌లోకెల్లా అత్యంత భారీ డీల్.

>
మరిన్ని వార్తలు