బాత్రూముల్లోకి తొంగిచూడొద్దు!

14 Feb, 2017 01:56 IST|Sakshi
బాత్రూముల్లోకి తొంగిచూడొద్దు!

ప్రధాని మోదీపై శివసేన విసుర్లు
ముంబై: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘రెయిన్  కోట్‌’ వ్యాఖ్యలపై బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా మండిపడింది. ఆయన ఇతరుల బాత్రూముల్లోకి తొంగిచూడ్డం మానుకుని, పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. ‘యూపీ ఎన్నికల్లో ఏం జరగాలో అదే జరుగుతుంది. ప్రధాని ఢిల్లీ, ముఖ్యమంత్రులు రాష్ట్రాలపై దృష్టి పెట్టాలి. ఇతరుల బాత్రూముల్లోకి తొంగిచూడకూడదు’ అని సోమవారం తన అధికార పత్రిక ‘సామ్నా’లో రాసిన సంపాదకీయంలో పేర్కొంది. విపక్షాల జాతకాలు తన చేతుల్లో ఉన్నాయని మోదీ, జాతకాలు ఇంటర్నెట్‌లోనూ దొరుకుతాయన్న యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. వారు ప్రధాని, సీఎంల పదవుల గౌరవాన్ని కాపాడాలని సూచించింది.

కాగా, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ఓ ఇంటర్వూ్యలో మాట్లాడుతూ.. ‘నోట్లరద్దుపై విచారణలో ఆర్బీఐ గవర్నర్‌పై పార్లమెంటరీ కమిటీ దాడికి దిగుతున్నప్పుడు మన్మోహన్ సభ్యత చూపి అడ్డుకున్నారు. ప్రధాని కూడా అలా సభ్యతతో వ్యవహరించాలి’ అన్నారు. మహారాష్ట్ర ప్రజలు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వంలోని తమ మంత్రులు ఉద్ధవ్‌ ఎప్పుడు ఆదేశించినా పదవులను నుంచి తప్పుకుంటారని శివసేన ప్రతినిధి మనీషా కయాందే అన్నారు.

మరిన్ని వార్తలు