జైల్లో బిర్యానీ తిని.. తప్పించుకుంటున్నారు

2 Nov, 2016 14:27 IST|Sakshi
జైల్లో బిర్యానీ తిని.. తప్పించుకుంటున్నారు

భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆ రాష్ట్ర మంత్రులు.. భోపాల్ ఎన్కౌంటర్ ఘటనను సమర్థిస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్నవారు ఏళ్లతరబడి జైళ్లలో చికెన్ బిర్యానీ తింటూ, తప్పించుకుని పారిపోయి మళ్లీ దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ చౌహాన్ అన్నారు. ఉగ్రవాదదాడి కేసులను విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన ఎనిమిదిమంది నిషేధిత సిమి కార్యకర్తలు ఎన్కౌంటర్లో హతమైన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు వచ్చాయి. ఎన్కౌంటర్కు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. పోలీసుల చర్యలను మధ్యప్రదేశ్ సీఎం, మంత్రులు సమర్థిస్తున్నారు. జైలు నుంచి తప్పించుకున్నాక ఖైదీలు పోలీసులపై కాల్పులు జరిపారని, దీంతో వారు ఎదురు కాల్పులు జరపక తప్పలేదని చెప్పారు. కాగా ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా జాతీయ మానవ హక్కుల సంఘం మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

>
మరిన్ని వార్తలు