యూకేపీఎన్ సీ అధినేత సంచలన వ్యాఖ్యలు

17 Sep, 2016 10:27 IST|Sakshi

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ కు చెందిన యూనైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ (యూకేపీఎన్పీ) అధినేత షౌకత్ అలీ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తనకేది తోచితే అది మాట్లాడుతోందని అన్నారు. ఎన్నటికీ కశ్మీర్ పాకిస్తాన్ లో అంతర్భాగం కాబోదని వ్యాఖ్యానించారు. కశ్మీర్ లో మతతత్వాన్ని విస్తృత స్ధాయిలో ప్రచారం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

పరమత సహనం కలిగిన కశ్మీరీలు పాకిస్తాన్ చూపుతున్న తప్పుడు మార్గాలను ఎంచుకోరని తాను భావిస్తున్నట్లు చెప్పారు. మానవహక్కుల ఉల్లంఘనపై పాకిస్తాన్ ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతుందని ప్రశ్నించారు. పాక్ అరాచకాలను ప్రపంచం మొత్తం చూస్తోందని, భవిష్యత్తులో ఆ దేశ అబద్దపు మాటలను ఎవరూ నమ్మరని అన్నారు. 

పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడిన నాటి నుంచే కశ్మీర్ లో మిలిటెన్సీని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. కశ్మీరీల జాతీయత, పరమత సహనాలకు భారత్ చక్కని మార్గం చూపాలని కోరారు. పాకిస్తాన్ అంతర్గతంగా తన పాలసీలు తయారుచేసుకోవడం, పరమత సహనాన్ని ప్రజల్లో వేళ్లూనుకునేలా చేసేంతవరకూ ఆ దేశాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. భారత్, పాక్ లు కశ్మీరీ ప్రజల రక్షించకుండా అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు.

మరిన్ని వార్తలు