శ్రీరామ్ లైఫ్ నుంచి ఏడు కొత్త పథకాలు

8 Jan, 2014 01:01 IST|Sakshi
శ్రీరామ్ లైఫ్ నుంచి ఏడు కొత్త పథకాలు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ శ్రీరామ్ లైఫ్ కొత్త మార్గదర్శకాలతో కూడిన ఏడు పథకాలను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో మూడు సంప్రదాయ పాలసీలుండగా, నాలుగు యూనిట్ ఆధారిత బీమా పథకాలు (యులిప్స్) ఉన్నాయి. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ సీఈవో మనోజ్ జైన్ ఈ పథకాలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే మరో మూడు నాలుగు పథకాలను విడుదల చేయనున్నామని, వీటికి ఇంకా ఐఆర్‌డీఏ అనుమతి లభించాల్సి ఉందని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు కొత్త ప్రీమియం ఆదాయ వృద్ధి స్థిరంగా ఉన్నప్పటికీ వచ్చే మూడు నెలల్లో 10 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ‘‘గతేడాది రూ.410 కోట్ల కొత్త ప్రీమియం ఆదాయం వచ్చింది. అది ఈ ఆర్థిక సంవత్సరాంతానికి రూ.450 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం.
 
 ప్రస్తుతం పాలసీదారులు యులిప్స్ కంటే సంప్రదాయ పాలసీలకే మొగ్గు చూపిస్తున్నారు. కానీ ఒక్కసారి మార్కెట్ లాభాలను అందించడం మొదలు పెడితే తిరిగి యులిప్స్‌కి డిమాండ్ పెరుగుతుంది’’ అని వివరించారు. ప్రస్తుతం జీవిత బీమా మార్కెట్లో 73 శాతం సంప్రదాయ పాలసీల నుంచి వస్తుంటే, 27 శాతం యులిప్స్ నుంచి వస్తున్నట్లు మనోజ్ జైన్ తెలియజేశారు. దక్షిణ భారతదేశంలో బాగా విస్తరించి ఉన్న తాము ఇప్పుడు ఉత్తర భారత దేశ విస్తరణపై దృష్టిసారించామని, ఇందులో భాగంగా గత పదినెలల్లో 80 శాఖలను ప్రారంభించామని తెలియజేశారు. దేశవ్యాప్తంగా మరో 50 శాఖలను ప్రారంభించడానికి ఐఆర్‌డీఏకి దరఖాస్తు చేసినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మరిన్ని వార్తలు