క్రికెటర్‌ సిద్ధుకు ఆ పదవి ఇవ్వనట్టే!

16 Mar, 2017 10:33 IST|Sakshi
క్రికెటర్‌ సిద్ధుకు ఆ పదవి ఇవ్వనట్టే!

చండీగఢ్: పంజాబ్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ గురువారం ప్రమాణం చేశారు. ఆయనతోపాటు తొమ్మిదిమంది మంత్రులు కూడా ప్రమాణం స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హాజరు అయ్యారు. అయితే, ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో.. పంజాబ్‌లో ఆ పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధుకు అంతా భావించినట్టుగానే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. అమరీందర్‌ సింగ్‌తోపాటు ప్రమాణం చేసిన తొమ్మిది మంది మంత్రుల జాబితాలో రెండోస్థానంలో సిద్ధు పేరు ఉంది. దీంతో ఆయన కేబినెట్‌ మంత్రిగా ప్రమాణం చేశారు.


బీజేపీ నుంచి దూరం జరిగి కొన్నాళ్లు ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధును డిప్యూటీ సీఎం పదవి ఆఫర్‌తో కాంగ్రెస్‌ పార్టీ తనవైపు తిప్పుకున్నట్టు అప్పట్లో కథనాలు వచ్చాయి. తాజాగా ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క పంజాబ్‌లోనే ఊరట కలిగించే విజయం లభించింది. ఈ నేపథ్యంలో సిద్ధుకు మంత్రి పదవితోనే సరిపెట్టారని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు