ధన త్రయోదశికి వెండితో సరి

2 Nov, 2013 00:30 IST|Sakshi
ధన త్రయోదశికి వెండితో సరి

* బంగారం అమ్మకాలు అంతంతే   
* 50 శాతానికి పడిన విక్రయాలు
 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు ధనత్రయోదశి (ధన్‌తేరాస్) నాడు కూడా నిరాశపర్చాయి. సాధారణంగా ఈ విశిష్ట రోజున హిందువులు తమ సామర్థ్యానికి తగ్గట్టుగా ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేయడం పరిపాటి. అలాంటిది గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు 50 శాతానికి పడిపోయాయి. 2012లో 10 గ్రాముల బంగారం సుమారు రూ.32,500 ఉంటే.. నేడు అటూ ఇటూగా రూ.వెయ్యి తక్కువగా ఉన్నా అమ్మకాలు ఆశించినస్థాయిలో నమోదు కాలేదు.

ద్రవ్యోల్బణం, బలహీన సెంటిమెంటు ఈ పరిస్థితికి కారణమని ఆల్ ఇండియా జెమ్స్, జువెల్లరీ ఫెడరేషన్ చైర్మన్ హరేష్ సోనీ తెలిపారు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఊహించనంతగా రూ.25 వేల స్థాయికి వచ్చింది. ఆ సమయంలో అప్పులు చేసి మరీ ఈ విలువైన లోహాన్ని కొనుగోలు చేశారు. అందుకే ధన త్రయోదశికి కొనేవారు లేరని వర్తకులు అంటున్నారు.
 
వెండి అమ్మకాలే ఎక్కువ..
బంగారానికి బదులు వెండి నాణేలు, ఇతర వెండి సామాగ్రి కొనేందుకే కస్టమర్లు ఎక్కువగా మొగ్గు చూపారు. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈసారి ధన త్రయోదశి అమ్మకాలు 20 శాతం కూడా నమోదు కాలేదని ఒక అసోసియేషన్ ప్రతినిధి చెప్పారు. ధన్‌తేరాస్ కాబట్టి సెంటిమెంట్ కోసం వెండి నాణేలు కొనుగోలు చేశారని ఆయన తెలిపారు. సుమారు రూ.70 లక్షల విలువైన వ్యాపారం తమ స్టోర్‌లో నమోదైందని అమీర్‌పేటలోని ఆర్‌ఎస్ బ్రదర్స్ జువెల్లరీ విభాగం మేనేజర్ నాగ కిరణ్ పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 30 శాతం తక్కువ అన్నారు.
 
ఎలక్ట్రానిక్స్ ఫర్వాలేదు..
దసరాతో పోలిస్తే ఈ దీపావళికి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు ఆశించినంతగా ఉన్నాయని కంపెనీలు అంటున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో దీపావళికి రూ.200 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈసారి ఇది రూ.160 కోట్లు ఉంటుందని ప్యానాసోనిక్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ మేనేజర్ బొమ్మారెడ్డి ప్రసాదరెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో ప్యానాసోనిక్ దసరాకు రూ.10 కోట్ల అమ్మకాలు చేయగా, దీపావళికి రూ.15 కోట్లు దాటతామని చెప్పారు. హైదరాబాద్‌లో దీపావళికి రూ.100 కోట్ల వ్యాపారం జరగొచ్చని ఆదీశ్వర్ ఆంధ్రప్రదేశ్ ఆపరేషన్స్ హెడ్ బాలాజీ రామ్ అన్నారు. ఆదీశ్వర్‌కు చెందిన 14 ఔట్‌లెట్లలో ఈ పండక్కి రూ.15 కోట్ల అమ్మకాలు అంచనా వేస్తున్నామని తెలిపారు. అత్యధికులు 32 అంగుళాల టీవీలను కొంటున్నారని వివరించారు.
 

మరిన్ని వార్తలు