రుణమాఫీ ఒకేసారి చేయలేం: సీఎం కేసీఆర్‌

22 Dec, 2016 04:48 IST|Sakshi
రుణమాఫీ ఒకేసారి చేయలేం: సీఎం కేసీఆర్‌

అది మా విధానం కాదన్న ముఖ్యమంత్రి
- కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసిందనో.. మరెవరో చెప్పారనో మా విధానం మార్చుకోం
- ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచితే ఒకేసారి మాఫీ చేస్తామన్నది నిజమే... అలా వచ్చిన రూ. 3 వేల కోట్లు మూడో విడత రుణమాఫీకే ఇచ్చాం
- అనుకున్నట్టుగా వాణిజ్య పన్నుల ఆదాయం రాలేదు
- కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడంతో భూముల అమ్మకాల ఆదాయం లేదు
- మిగిలిన 25 శాతానికి వచ్చే బడ్జెట్‌లో నిధులిస్తాం


సాక్షి, హైదరాబాద్‌:

రైతులకు రుణమాఫీ చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని, అయితే ఒకేసారి రుణమాఫీ చేయడం తమ ప్రభుత్వ విధానం కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసిందనో, మరెవరో చెప్పారనో తమ విధానం మార్చుకోలేమని తేల్చిచెప్పారు. బుధవారం అసెంబ్లీలో వ్యవసాయంపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. కేంద్రం రాష్ట్రానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచితే ఒకేసారి రుణమాఫీ చేస్తామని సీఎం గతంలో చెప్పిన విషయాన్ని చర్చ సందర్భంగా విపక్ష నేత జానారెడ్డి గుర్తుచేశారు.

దీనిపై సీఎం వివరణ ఇస్తూ... ‘‘ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 0.5 శాతం పెరిగి, వాణిజ్య పన్నులు రూ.4.5 వేల కోట్లకు చేరి, బడ్జెట్లో పేర్కొన్న విధంగా భూముల అమ్మకాల ద్వారా ఆదాయం పెరిగితే.. ఒకేసారి రుణమాఫీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని మేం చెప్పిన మాట వాస్తవమే. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు మేరకు వచ్చిన ఆదాయంలో రూ.3 వేల కోట్లు మూడో విడత రుణమాఫీకే అందజేశాం. అనుకున్నట్టుగా వాణిజ్య పన్నుల ఆదాయం పెరగకపోగా.. పెద్దనోట్ల రద్దు ప్రభావంతో భూముల అమ్మకాల ద్వారా ఆదాయం వచ్చే మార్గం కూడా లేకపోయింది’’ అని అన్నారు.

రుణమాఫీ ఇప్పటికే 75 శాతం పూర్తయిందని, మిగిలిన 25 శాతానికి రానున్న బడ్జెట్‌ సమావేశాల్లోగా నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. రుణమాఫీ మొత్తం రూ.17,500 కోట్లలో 75 శాతం పోగా.. మిగిలిన మొత్తానికి రైతులకు సంబంధం లేకుండా తామే చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు హామీ ఇచ్చిందని తెలిపారు. రైతులు తమ పాత రుణంతో సంబంధం లేకుండా బ్యాంకుల నుంచి కొత్త రుణం పొందవచ్చని తెలిపారు. మొత్తం 35 లక్షల మంది రైతుల్లో ఎక్కడైనా కొందరికి ఇబ్బందులు తలెత్తి ఉండొచ్చని, కొన్నిచోట్ల బ్యాంకులు సరిగా వ్యవహరించకపోయి ఉండొచ్చని పేర్కొన్నారు. విపక్ష సభ్యులుS పేర్కొన్న విధంగా ఎక్కడైనా రైతులకు అన్యాయం జరిగినా, వడ్డీ భారం పడినా, ప్రభుత్వం దృష్టికి తెస్తే ఆ భారాన్ని మోసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. త్వరలోనే బ్యాంకులతో సమీక్షించి రైతుల నుంచి వసూలు చేసిన వడ్డీ వివరాలను సేకరించాలని వ్యవసాయ, ఆర్థిక మంత్రులకు సూచించారు.

నిజాం షుగర్స్‌ ముగిసిన అధ్యాయం
తెలంగాణకు గర్వకారణమైన నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలని 2004లోనే తాను కేంద్రంతో కొట్లాడానని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అయితే.. పదేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోని కారణంగా అక్కడి రైతులంతా చెరకు వేయడం మాని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారని చెప్పారు. ఫ్యాక్టరీని పూర్తిస్థాయిలో నిర్వహించాలంటే ఆ ప్రాంతంలో రైతులు కనీసం 10 లక్షల టన్నుల చెరకు పండించాలన్నారు.

అయితే ప్రస్తుతం లక్ష టన్నులకు మించి చెరకు పంట లేనందున ఫ్యాక్టరీ నిర్వహణ సాధ్యం కాదని చెప్పారు. అయినా మహారాష్ట్ర తరహాలో రైతులు సొసైటీగా ఏర్పడి ఫ్యాక్టరీని నడుపుకునేట్లయితే తెరిపిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఫ్యాక్టరీ నిర్వహణ విషయమై రైతులు విముఖత వ్యక్తం చేయడంతో ఆ అంశం ముగిసి పోయిందన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చెబుతున్న విధంగా రైతులు ఫ్యాక్టరీని నిర్వహించేందుకు సిద్ధంగా ఉంటే.. సదరు సొసైటీకి ఆయన్నే చైర్మన్‌గా చేసేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

మరిన్ని వార్తలు